YCP social media: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) అధినేత జగన్మోహన్ రెడ్డిలో ఒక స్పష్టమైన మార్పు వచ్చింది. ఓటమి ఆయనలో మార్పు తెచ్చింది. గతంలో ప్రెస్ మీట్ పెట్టేందుకు ఆయన ఇష్టపడేవారు కాదు. మీడియా సమావేశాలకు దూరంగా ఉండేవారు. ఏదైనా మాట్లాడాలనుకుంటే నేషనల్ మీడియాతో మాట్లాడేవారు. ఏదో మాట్లాడాలనుకుంటే రికార్డింగ్ వీడియోను బయటకు వదిలేవారు. వైసిపి తో పాటు అప్పటి వారి ప్రభుత్వానికి అనుకూలంగా సోషల్ మీడియా టీం ప్రచారం చేసేది. అయితే ఎప్పుడైతే ఓటమి ఎదురైందో నాటి నుంచి జగన్ మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా మీడియా సమావేశాల్లో ఆయన చెబుతున్న దానికి.. వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారానికి భిన్నంగా ఉంటుంది. ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు గందరగోళంలోకి నడుస్తుంది.
విశాఖకు( Visakhapatnam) ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. అమెరికా వెలుపల.. ఆసియా ఖండంలో ఇదే అతిపెద్ద డేటా సెంటర్. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. జనాల నుంచి కూడా సంతృప్తి కనిపిస్తోంది. ఒక్క వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తప్ప. గత కొద్దిరోజులుగా ఎంతో రాద్దాంతం చేస్తూ వస్తున్నారు. సుమారు 80 వేల కోట్లకు పైగా పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ లను ఏర్పాటు చేస్తుండడంపై ఆ రంగ నిపుణులు ఆనందం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం తీరుపై ఇతర రాష్ట్రాల్లో బలమైన చర్చ నడుస్తోంది. తమ రాష్ట్రానికి రాకుండా ఏపీ వైపు పెట్టుబడులు ఎలా వెళుతున్నాయి అన్న టాక్ ఉంది.
వైసిపి సరికొత్త ప్రచారం..
అయితే కూటమి ప్రభుత్వం పై వస్తున్న సానుకూలతను చూసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రచారానికి తెరలేపింది. అసలు గూగుల్ డేటా సెంటర్( Google data centre) వల్ల ప్రయోజనం లేదని.. దీనివల్ల వచ్చేది కేవలం 200 ఉద్యోగాలు మాత్రమేనని.. ఇతర దేశాల్లో ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక ఇండియాను వేదికగా ఎంచుకున్నారని… దీనివల్ల వైజాగ్ లో నీటి సమస్య తలెత్తుతుందని.. భారీగా నీరు అవసరం అవుతుందని.. విద్యుత్ వినియోగం పెరిగి జనం మీద భారం పడుతుందని.. పర్యావరణం దెబ్బతింటుందని.. ఇలా అనేక ప్రతికూలతలను చూపించి.. గూగుల్ డేటా సెంటర్ అనేది వృధా ప్రయాస అని తేల్చేశారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.
గూగుల్ డేటా సెంటర్ ను సమర్ధించిన జగన్
అయితే విదేశాల నుంచి ఏపీకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ( press meet)పెట్టారు. మీడియా ముందుకు వచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల గాలి తీసేశారు. గూగుల్ డేటా సెంటర్ గురించి ఆయన చాలా సానుకూలంగా మాట్లాడారు. దీనిని ఎంత మాత్రం వ్యతిరేకించడం లేదని.. ఆహ్వానిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. గూగుల్ డేటా సెంటర్ వల్ల వచ్చే ఉద్యోగాలు తక్కువ కావచ్చు ఏమో కానీ.. దాని ద్వారా పెద్ద ఎకో సిస్టం తయారవుతుందని.. ఎన్నెన్నో పరిశ్రమలు వస్తాయని చెప్పడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది. అంతటితో ఆగకుండా గూగుల్ డేటా సెంటర్, ఏఐ హబ్ విశాఖకు రావడం వెనుక వైసిపి ప్రభుత్వ కృషి ఉందని చెప్పుకొచ్చారు. దీంతో దీనిపై ఎలా ముందుకెళ్లాలో తెలియడం లేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు. సోషల్ మీడియాలో సైతం గుప్ చప్ అయ్యారు.