Chiranjeevi: పవన్ కు మద్దతుగా రంగంలోకి చిరంజీవి

ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి చెప్పినట్లు చిరంజీవి ఏనాడో ప్రకటించారు. చిరంజీవి కోసం బిజెపి సైతం ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. ప్రధాని మోదీ చనువుగా ఉండడంతో పాటు ఒకరిద్దరు కేంద్ర మంత్రులు నేరుగా చిరంజీవిని కలిశారు.

Written By: Dharma, Updated On : April 12, 2024 10:29 am

Chiranjeevi

Follow us on

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఎన్నికల ప్రచారం చేస్తారా? తమ్ముడికి మద్దతుగా నిలుస్తారా? ఆయన పోటీ చేస్తున్న పిఠాపురంలో పర్యటిస్తారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. జనసేనకు మెగాస్టార్ చిరంజీవి ఐదు కోట్ల రూపాయల విరాళం అందించిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఏమంత సంచలనం కాదు. పవన్ కళ్యాణ్ స్వయాన సోదరుడు. తమ్ముడి పార్టీకి అన్న విరాళం ఇవ్వడం ప్రత్యేక విషయం కాదు. కానీ సరిగ్గా ఎన్నికల ముంగిట ఈ విరాళం ప్రకటించడం వ్యూహాత్మకంగా తేలుతోంది. మెగా అభిమానులకు ఇదొక పిలుపు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నా తమ్ముడి వెంట నేను ఉన్నాను.. నన్ను అభిమానించే వారు కూడా ఉండండి అని చిరంజీవి సంకేతాలు పంపారని టాక్ నడుస్తోంది. అప్పటి నుండి చిరంజీవి చుట్టూ వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. చిరంజీవి తప్పకుండా జనసేనకు మద్దతుగా ప్రచారం చేస్తారన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.

ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి చెప్పినట్లు చిరంజీవి ఏనాడో ప్రకటించారు. చిరంజీవి కోసం బిజెపి సైతం ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. ప్రధాని మోదీ చనువుగా ఉండడంతో పాటు ఒకరిద్దరు కేంద్ర మంత్రులు నేరుగా చిరంజీవిని కలిశారు. అయినా సరే చిరంజీవి నుంచి ఎటువంటి చలనం లేదు. అటువంటి చిరంజీవి ఇప్పుడు తమ్ముడికి పరోక్ష మద్దతు తెలపడం విశేషం. పవన్ కళ్యాణ్ నిస్వార్ధంగా చేస్తున్న ప్రజాసేవ, ముఖ్యంగా కౌలు రైతుల కుటుంబాలకు అందిస్తున్న సాయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ చిరంజీవి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. జనసేనకు ఇదో అడ్వాంటేజ్ అవుతుందని.. మెగాస్టార్ అభిమానులు ఏకతాటిపైకి వచ్చి పవన్ కు అండగా నిలబడతారని ప్రచారం జరుగుతోంది. అయితే చిరంజీవి జనసేనకు మద్దతుగా ప్రచారం చేస్తారా? అది సాధ్యమేనా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు కేటాయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో పవన్ పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. భాగస్వామ్య పార్టీల నేతలతో కలిసి ఉమ్మడి ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. అటు జనసేన తరఫున స్టార్ క్యాంపైనర్లను సైతం ప్రకటించారు. పవన్, నాగబాబు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, జబర్దస్త్ నటులు హైపర్ ఆది, గెటప్ శీను, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, సీరియల్ నటుడు సాగర్, క్రికెటర్ అంబటి రాయుడు పేర్లను ప్రకటించారు. ఇప్పటికే హైపర్ ఆది పిఠాపురంలో ఒక విడత పర్యటన పూర్తి చేశారు. మిగతావారు కూడా రంగంలోకి దిగబోతున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా మెగాస్టార్ చిరంజీవి ప్రచారంలోకి వస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.

పిఠాపురంలో చిరంజీవి ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఏ క్షణమైనా ప్రకటన వచ్చే అవకాశం ఉందని జోరుగా చర్చ సాగుతోంది. అయితే అది సాధ్యం అయ్యే పని కాదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో మెగా కాంపౌండ్ వాల్ నుంచి చాలామంది హీరోలు ఎన్నికల ప్రచారం చేశారు. అటు బుల్లితెర నటులు సైతం అండగా నిలిచారు. కానీ చిరంజీవి ఎన్నడు నోరు తెరవలేదు. ఈ ఎన్నికల్లో చిరంజీవి నుంచి కీలక ప్రకటనలు వస్తాయే కానీ.. ఎన్నికల ప్రచారానికి వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఒకవేళ ఆయన వచ్చిన కేవలం పవన్ పోటీ చేస్తున్న పిఠాపురానికి పరిమితం అవుతారని కూడా మరో ప్రచారం జరుగుతోంది. మరి చిరంజీవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.