https://oktelugu.com/

Chandrababu: చంద్రబాబులో మరీ ఇంత మార్పా.. కారణమేంటి?

టిడిపి, జనసేన, బిజెపి శ్రేణుల మధ్య సమన్వయానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. మూడు పార్టీలు కలిసినా.. రకరకాల సమస్యలు తెరపైకి వచ్చాయి. టిక్కెట్లు దక్కని సొంత పార్టీల నేతలు, ప్రత్యర్థులు ఓట్ల బదలాయింపు విషయంలో లేనిపోని గందరగోళం సృష్టిస్తున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : April 12, 2024 / 10:35 AM IST

    Chandrababu

    Follow us on

    Chandrababu: చంద్రబాబు ప్రసంగ శైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఆయన నోరు తెరిస్తే సైబరాబాద్ తానే కట్టానని, టెక్నాలజీకి అధ్యుడునని, అభివృద్ధికి అంబాసిడర్ నని చెప్పుకోవడం అలవాటు. అయితే ఈ తరహా ప్రసంగానికి ప్రజలు అలవాటు పడిపోయారు. అందుకే చంద్రబాబు రూట్ మార్చారు. మూస ధోరణులకు స్వస్తి చెబుతున్నారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. స్థానిక అంశాలకు ప్రాధాన్యమిస్తున్నారు. తాను చెప్పాలనుకున్నది సూటిగా, సుత్తి లేకుండా చెబుతున్నారు. చంద్రబాబు ప్రసంగాల్లో మారిన వైఖరి చూసి తమ్ముళ్లు కూడా ఆనందపడుతున్నారు.

    చేసింది చెప్పడం కంటే.. చేయాల్సింది, ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తేనే ప్రజలు ఆహ్వానిస్తారని చంద్రబాబు గుర్తించినట్టు ఉన్నారు. అందుకే ఎన్నికల ప్రచారానికి వెళ్లే సమయంలో ఆ ప్రాంత సమస్యలను తెలుసుకుంటున్నారు. ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారు. వాటికి అనుగుణంగానే తన ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతున్నారు. ఎక్కడికి వెళ్తే.. అక్కడ సమస్యలు ప్రస్తావిస్తున్నారు. తణుకు, పాలకొల్లులో స్థానిక సమస్యలకే ప్రాధాన్యమించారు. పి గన్నవరం లో కూడా చంద్రబాబు అదే పద్ధతిని అనుసరించారు. ఇది సామాన్యులకు సైతం బాగా కనెక్ట్ అవుతుండడంతో.. స్థానిక అంశాలకే ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

    టిడిపి, జనసేన, బిజెపి శ్రేణుల మధ్య సమన్వయానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. మూడు పార్టీలు కలిసినా.. రకరకాల సమస్యలు తెరపైకి వచ్చాయి. టిక్కెట్లు దక్కని సొంత పార్టీల నేతలు, ప్రత్యర్థులు ఓట్ల బదలాయింపు విషయంలో లేనిపోని గందరగోళం సృష్టిస్తున్నారు. దీంతో అక్కడ గ్యాప్ లేకుండా చూసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. మూడు పార్టీలు కలవలేదన్న చర్చకు చంద్రబాబు చెక్ పెడుతున్నారు. ఒక్క తెలుగుదేశం పార్టీని ప్రమోట్ చేయకుండా.. మూడు పార్టీల గురించి ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో మూడు పార్టీలు ఒక్కటేనన్న సంకేతాలు పంపుతున్నారు. పి. గన్నవరం లో జనసేన అభ్యర్థి పోటీ చేస్తున్నారు. నరసాపురం పార్లమెంట్ స్థానంలో బిజెపి అభ్యర్థి బరిలో ఉన్నారు. వారిద్దరిని పక్కన పెట్టుకుని మరీ.. చంద్రబాబు చేతులు జోడించి వారిని గెలిపించాలని కోరారు.

    ఉభయగోదావరి జిల్లాల్లో పవన్ ఫాలోయింగ్ గురించి చెప్పనవసరం లేదు. అక్కడ పవన్ ఇమేజ్ ను మరింత పెంచేలా చంద్రబాబు తన ప్రసంగాలను కొనసాగిస్తున్నారు. జనసైనికుల్లో సైతం జోష్ నింపుతున్నారు. పవన్ ప్రజల కోసమే వచ్చాడని.. సంపాదించుకునే మార్గాలను వదులుకున్నారని చెప్పడం ద్వారా యువతలో ఆయన ఫాలోయింగ్ పెంచేందుకు దోహదపడుతున్నారు. అటు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తో పాటు బిజెపి అగ్రనేతల విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీని అభివృద్ధి చేసుకుందామని ప్రజలకు పిలుపునిస్తున్నారు. మొత్తంగా చూస్తే చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా తన ప్రసంగ శైలిని మార్చుకున్నట్లు తెలుస్తోంది.

    చంద్రబాబు ప్రసంగంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. పేరుకే పొత్తు కానీ మూడు పార్టీల మధ్య సమన్వయం లేదని.. ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగదని.. రకరకాల విశ్లేషణలు వచ్చాయి. మరోవైపు పోలింగ్ కు నెల రోజుల వ్యవధి ఉంది. ఈ ప్రచారానికి చెక్ చెప్పి.. మూడు పార్టీల శ్రేణులను ఏకతాటిపైకి తేవాలని చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగానే తన ప్రసంగంలో స్పష్టమైన మార్పు చేశారు. మూడు పార్టీల ఉమ్మడి శత్రువుగా వైసీపీని చూపేందుకు చంద్రబాబు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.