TDP BJP JanaSena: ఆంధ్రప్రదేశ్ లో( Andhra Pradesh) విచిత్ర రాజకీయాలు నడుస్తున్నాయి. మూడు పార్టీలు ఉమ్మడి ప్రభుత్వాన్ని నడుపుతుండగా.. చంద్రబాబు స్పష్టమైన ముద్ర చాటుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి సంపూర్ణ సహకారం ఆయనకు అందుతోంది. మరోవైపు బిజెపి సైతం ఏపీ విషయంలో చంద్రబాబుకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. దీంతో మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వాన్ని చంద్రబాబు అలవోకగా ముందుకు తీసుకెళ్లగలుగుతున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ క్యాడర్ చెక్కుచెదరకుండా గట్టి చర్యలే తీసుకుంటున్నారు. టిడిపి క్యాడర్ క్షేత్రస్థాయిలో బలంగా ఉంటేనే వచ్చే ఎన్నికల్లో కూటమి గెలిచే అవకాశం ఉంటుంది. అందుకే టిడిపి క్యాడర్ను పట్టిష్టపరిచే నాయకత్వానికి బాధ్యతలు అప్పగిస్తున్నారు చంద్రబాబు. దీనికి సైతం జనసేనతో పాటు బిజెపి నుంచి చంద్రబాబుకు సంపూర్ణ సహకారం అందుతుండడం విశేషం. అయితే ఈ పరిస్థితుల్లో కొన్ని నియోజకవర్గాల్లో టిడిపి ఇన్చార్జిల నియామకం చిత్ర విచిత్రాలకు కారణమవుతోంది.
టిడిపి అనుబంధ సంస్థగా..
వాస్తవానికి బిజెపి( Bhartiya Janata Party) జాతీయ పార్టీ. దేశంలోనే శక్తివంతమైన పార్టీ. కానీ ఏపీలో మాత్రం టిడిపికి అనుబంధ సంస్థగా మారిపోయిందన్న విమర్శలు ఉన్నాయి. బిజెపిలో ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కువమంది టీడీపీ నుంచి వెళ్లిన వారే. అంతెందుకు ఎన్నికలకు ముందు టిడిపి నుంచి బిజెపిలో చేరి టిక్కెట్లు దక్కించుకున్న వారు ఉన్నారు. ఎమ్మెల్యేలు అయిన వారు ఉన్నారు. అయితే అక్కడ పేరుకే బిజెపి ఎమ్మెల్యేలు కానీ.. వారు టిడిపి ఎమ్మెల్యేలు గానే చలామణి అవుతున్నారు. ఇప్పుడు అక్కడ కొత్తగా ఇన్చార్జిలను నియమించాలని టిడిపి భావిస్తోంది. కానీ ఆ ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నాయంగా నియమిస్తున్న ఇన్చార్జులు బిజెపి ఎమ్మెల్యేలకు సమీప బంధువులు కావడం గమనార్హం.
Also Read: కేర్ టేకర్ అని నమ్మి జాబ్ ఇస్తే గొంతుకోసింది.. విజయవాడలో ఘాతుకం
అనపర్తిలో అలా ఛాన్స్..
మూడు పార్టీల మధ్య ఈ ఎన్నికల్లో పొత్తు కుదిరింది. అయితే బిజెపికి సరైన అభ్యర్థులు లేకుండా పోయారు. ఈ క్రమంలో టిడిపి నుంచి నేతలను బిజెపిలోకి పంపించి పోటీ చేయించారు. అలా వెళ్ళిన వారే అనపర్తి బిజెపి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి( Ramakrishna Reddy). వైసిపి హయాంలో అనపర్తి లో ఎంతో కష్టపడ్డారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. కానీ చివరి నిమిషంలో ఈ సీటును పొత్తులో భాగంగా బిజెపికి కేటాయించారు. దీంతో రామకృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. వెంటనే ఆయనను బిజెపిలో చేర్పించి ఆ పార్టీ టికెట్ ఇప్పించగలరు చంద్రబాబు. అయితే ఇప్పుడు అదే నియోజకవర్గానికి టిడిపి ఇన్చార్జిని నియమించాలని భావిస్తున్నారు చంద్రబాబు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కుమారుడు మనోజ్ కు టిడిపి బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే తండ్రి బిజెపి… కొడుకు టిడిపి ఇన్చార్జ్ అన్నమాట.
కర్నూలులోనూ అంతే..
అయితే ఇదే పరిస్థితి కర్నూలు జిల్లాలో( Kurnool district) కూడా ఉంది. అక్కడ సీనియర్ నేత, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ బిజెపి నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన కుమారుడు భరత్ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. టిడిపి నుంచి బిజెపిలో చేరిన టీజీ వెంకటేష్ కుమారుడికి కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి టికెట్ ఇప్పించుకున్నారు. టిడిపి ఎమ్మెల్యేగా గెలిచిన భరత్ మంత్రి కూడా అయ్యారు. అయితే వెంకటేష్ మాత్రం బిజెపిలోనే కొనసాగుతూ వస్తున్నారు. అయితే ఇలా మేనేజ్ చేయడం అనేది చంద్రబాబు ఒక్కరికే సాధ్యం. అయితే టిడిపి నుంచి ఎన్నికలకు ముందు జనసేనలో చేరిన చాలామందికి కూడా ఇట్టే టిక్కెట్లు లభించాయి.