AP Cabinet meeting : ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి 100 రోజులవుతోంది. ఎన్నికల సందర్భంగా చాలా హామీలు ఇచ్చారు చంద్రబాబు. వాటిని తీర్చే పనిలో పడ్డారు. తాజాగా మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలకు సైతం ఆమోదం తెలిపారు. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన సమావేశంలో ఏపీలో నూతన మద్యం పాలసీకి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలో నాణ్యమైన మద్యం అందిస్తూనే క్వార్టర్ ధర సగటున 99 రూపాయలుగా ఉండాలని నిర్ణయించింది. అటు వలంటీర్ల అంశంపై సైతం సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా నూతన మద్యం పాలసీ అమల్లోకి తెస్తామని ప్రకటించడంతో మందుబాబుల్లో ఒక రకమైన ఆనందం వ్యక్తం అవుతోంది. వైసిపి హయాంలో ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలను నడిపింది.ధరలను సైతం అమాంతం పెంచేసింది. పాత బ్రాండ్లు లేకుండా విక్రయించింది.తాము అధికారంలోకి వస్తే మంచి బ్రాండ్ల మద్యం విక్రయిస్తామని.. తక్కువ ధరకే అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే తాజాగా కొత్త మద్యం పాలసీని ప్రకటించారు. తిరిగి ప్రైవేటు వ్యక్తులకే టెండర్ల ప్రక్రియ ద్వారా మద్యం దుకాణాలు అప్పగించునున్నారు. రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ సైతం విడుదల చేయనున్నారు.
*వరద ప్యాకేజీకి ఆమోదం
ఇటీవల వరదలకు తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. వరద ప్రభావిత ప్రాంతాలకు ప్రకటించిన ప్యాకేజీకి సైతం క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. భోగాపురం ఎయిర్పోర్ట్ కు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని తీర్మానించింది. వాలంటీర్ల వ్యవస్థ పై సైతం సుదీర్ఘంగా చర్చించింది. ప్రస్తుతం ఉన్న వలంటీర్లలో అవసరం మేర కొనసాగించాలని.. అందులోనూ వారికి స్కిల్స్ శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రయోజనం ఉంటుందని అభిప్రాయం మంత్రివర్గ సమావేశంలో వ్యక్తం అయింది.
* తీసుకున్న నిర్ణయాలు ఇవే
* పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణం సిడబ్ల్యుసి సూచనల మేరకు పాత ఏజెన్సీకి ఇవ్వాలని నిర్ణయించారు. ఒకే ఏజెన్సీకే పనులు కేటాయించడం వల్ల బాధ్యత ఉంటుందని మంత్రివర్గం అభిప్రాయపడింది.* ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిస్తూ స్టెమీ పథకం ప్రారంభించాలని నిర్ణయించారు.
* ఆధార్ కార్డు తరహాలో విద్యార్థులకు అపార్ గుర్తింపు కార్డులు జారీ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు.
* హోం శాఖలో కొత్త కార్పొరేషన్ ఏర్పాటు.. దానికిగాను 10 కోట్ల రూపాయలతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయనున్నారు.
* వాలంటీర్లను, సచివాలయాలను వివిధ శాఖల్లో కలిపేలా చర్యలు చేపట్టనున్నారు.
* ఉద్యోగుల భర్తీపై జరగని చర్చ
అయితే మద్యం పాలసీ వరకు ఓకే కానీ.. ఉద్యోగాల భర్తీ హామీ విషయంలో ఎటువంటి చర్చలు జరపకపోవడం విమర్శలకు తావిస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఫైల్ పై సీఎం చంద్రబాబు సంతకం చేశారు. అసలు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో చెప్పలేదు. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీ విషయంలో సైతం ఎటువంటి ప్రకటన చేయలేదు. వాలంటీర్ల కొనసాగింపు పై ఎటువంటి నిర్ణయం లేదు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బంది విషయంలో ఎటువంటి స్పష్టత లేదు. ఈ విషయంలో మాత్రం నిరుద్యోగ యువతలో ఒక రకమైన అసంతృప్తి ప్రారంభమైంది. ఇదే కానీ ముదిరితే కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు తప్పవు.