Balineni Srinivasa Reddy: ఎట్టకేలకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎపిసోడ్ కు ఎండ్ కార్డు పడింది. వైసీపీని వీడుతున్నట్లు ఆయన ప్రకటించారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపించారు. జగన్ వైఖరి నచ్చకే తాను పార్టీని వీడుతున్నట్లు అందులో పేర్కొన్నారు. దీంతో ఈ ఎన్నికలకు ముందు నుంచి సాగుతున్న హైడ్రామాకు తెరపడింది. వైసీపీ కీలక నేత రాజీనామాతో ఆ పార్టీలో ఒక రకమైన అలజడి రేగింది. వాస్తవానికి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈ ఎన్నికలకు ముందు నుంచే హెచ్చరికలు పంపిస్తూ వచ్చారు. రాజీనామా చేస్తానని మీడియాకు లీకులు ఇచ్చేవారు. అది జగన్ దృష్టికి వెళ్లడం.. పంచాయితీలు జరగడం.. తిరిగి పార్టీలోనే కొనసాగుతానని బాలిలేని ప్రకటించడం పరిపాటిగా మారింది. అయితే బాలినేని చర్యలతో విసిగి వేశారి పోయిన జగన్ పట్టించుకోవడం మానేశారు. ఇటీవలే బాలినేని తో నేరుగా సమావేశం అయ్యారు. చెప్పాల్సింది చెప్పేశారు. బాలినేని షరతులకు జగన్ అంగీకరించలేదు. అందుకే ఇప్పుడు జగన్ వైఖరి నచ్చక తాను పార్టీని వీడుతున్నట్లు బాలినేని ప్రకటించారు.
* సమీప బంధువు
బాలినేని శ్రీనివాస్ రెడ్డి జగన్ కు సమీప బంధువు. జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కి స్వయానా బావ. ప్రకాశం జిల్లా రాజకీయాలను శాసించారు బాలినేని. అదే పట్టును వదులుకోవడానికి ఇష్టపడలేదు. అయితే మధ్యలో వైవి సుబ్బారెడ్డి ఎంటర్ అయ్యేసరికి సీన్ మారింది. అధిష్టానం వద్ద వైవి సుబ్బారెడ్డి కి ప్రాధాన్యం పెరగడం.. తనకు తగ్గడంతో బాలినేని మనస్థాపానికి గురయ్యారు. పైగా పక్క జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తెప్పించడం.. తనను తొక్కి పెట్టేందుకేనన్న అనుమానం బలపడింది.అందుకే పార్టీని వీడడమే శ్రేయస్కరమని ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. పార్టీకి రాజీనామా ప్రకటించారు. బంధుత్వం వేరు.. రాజకీయాలు వేరని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో భాష ముఖ్యమని బాలినేని కారణం చెబుతుండడంతో కొత్త చర్చకు దారితీసింది. బాలినేని విధించిన షరతులకు జగన్ ఒప్పుకోకపోవడం వల్లే అలా మాట్లాడుతున్నారని తెలుస్తోంది.
* రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో
రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు బాలినేని. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. 2004, 2009లో సైతం అదే పార్టీ నుంచి గెలిచారు. జగన్ వైసీపీని ఏర్పాటు చేయడంతో ఆ పార్టీ వెంట నడిచారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2014లో మాత్రం ఓడిపోయారు. 2019లో గెలిచి మంత్రి అయ్యారు. కానీ విస్తరణలో మంత్రి పదవి కోల్పోయారు. అప్పటినుంచి అసంతృప్తితో రగిలిపోయారు. అదే జిల్లాకు చెందిన మరో మంత్రి పదవిని కొనసాగిస్తూ.. తనను తీసివేయడం వెనుక వైవి సుబ్బారెడ్డి పాత్ర ఉందని అనుమానించారు. అలాగత రెండేళ్లుగా అనుమానం, అసంతృప్తితో వ్యవహరించిన బాలినేని ఎట్టకేలకు వైసీపీకి దూరమయ్యారు.
* త్వరలో జనసేనలోకి
బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. ఇప్పటికే ఆ పార్టీ కీలక నేత నాగబాబుకు టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు నుంచే పవన్ విషయంలో బాలినేని సానుకూలంగా ఉన్నారు. టిడిపిలోకి వెళ్లినా ఆ స్థాయిలో గుర్తింపు అసాధ్యం. అందుకే జనసేనలో చేరితే తనకు గుర్తింపు ఇస్తారని.. తగిన గౌరవం లభిస్తుందని బాలినేని ఆశించారు. జనసేన నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆ పార్టీలో చేరేందుకు డిసైడ్ అయ్యారు. వైసీపీకి రాజీనామా చేసి ఇప్పుడు పవన్ సమక్షంలో జనసేనలో చేరతారని తెలుస్తోంది. మొత్తానికైతే బంధుత్వాన్ని పక్కనపెట్టి.. రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని తెంచుకుంటున్నారు బాలినేని.