Chandrababu Arrest: తెలుగుదేశం పార్టీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఐటెం నెంబర్ 62 కింద లిస్ట్ చేసింది. దీంతో అత్యున్నత న్యాయస్థానంలో విచారణకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే చంద్రబాబుకు ఊరట లభిస్తుందా? లేదా? అన్న నరాలు తెగే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది.స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు రిమాండ్ విధించి మంగళవారం నాటికి దాదాపు పాతిక రోజులు అవుతోంది. క్వాష్ పిటిషన్ లో తనకు అనుకూలమైన తీర్పు వస్తుందని చంద్రబాబు ఆశాభావంతో ఉన్నారు.
వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత 2021 లో స్కిల్ డెవలప్మెంట్ స్కాం పై దర్యాప్తు ప్రారంభమైంది. గత రెండేళ్లుగా విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో చంద్రబాబును a37 గా చూపించారు. అంతకు ముందున్న 36 మందిని సైతం విచారించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తనను అరెస్ట్ చేశారని చంద్రబాబు చెబుతున్నారు. కానీ లోతైన విచారణ చేశామని.. ఇంకా విచారణ చేపట్టాల్సి ఉందని.. ఈ దశలో చంద్రబాబును రిమాండ్ నుంచి తప్పిస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సిఐడి వాదిస్తోంది.దీంతో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ ఉత్కంఠ గా మారింది.
చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ఏసీబీ కోర్టుతో పాటు హైకోర్టులో కొట్టివేతకు గురైంది. ప్రస్తుతం కేసు విచారణలో ఉన్నట్టు సిఐడి చెబుతోంది. దీనిని ఆధారంగా చేసుకుని కింది కోర్టులు పిటీషన్ కొట్టు వేశాయి. ఈ తరుణంలో సుప్రీంకోర్టులో ఎటువంటి తీర్పు రానుంది? న్యాయస్థానం ఏం చెప్పబోతోంది? అన్నది తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. అందరిలోనూ ఆసక్తి పెంచుతోంది. తప్పనిసరిగా క్వాష్ పిటిషన్ ను న్యాయస్థానం సమర్థిస్తే టిడిపికి అదనపు బలమే. చంద్రబాబు మీద ఏ కేసు లేనట్లే. ఆయన క్షేమంగా బయటపడే అవకాశం ఉంది. అటు బెయిల్ పిటిషన్లు పెట్టకుండా టిడిపి వ్యూహాత్మకతకు సార్ధకత చేరనుంది.
ఒకవేళ సుప్రీంకోర్టులో వ్యతిరేక తీర్పు వస్తే మాత్రం చంద్రబాబు బెయిల్ కోసం పావులు కలిపే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ చంద్రబాబు బెయిల్ పై బయటకు వచ్చినా అవినీతి కేసులు వైసీపీకి ఒక ప్రచార అస్త్రంగా మారనున్నాయి. అటు కేసు విచారణలో సైతం చంద్రబాబుకు తలనొప్పిగా మారనున్నాయి. అందుకే క్వాష్ పిటీషన్ లో అనుకూల తీర్పు రావాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు బలంగా కోరుకుంటున్నాయి.