CM Chandrababu: అమరావతిపై చంద్రబాబు శ్వేతపత్రం

2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిని ఎంపిక చేసింది. శాసనసభలో అన్ని వర్గాల అభిప్రాయాన్ని సైతం తీసుకుంది. జగన్ అమరావతి రాజధానిని స్వాగతించారు.

Written By: Dharma, Updated On : July 3, 2024 5:25 pm

CM Chandrababu

Follow us on

CM Chandrababu: వైసిపి ప్రభుత్వ వైఫల్యాలపై దృష్టి పెట్టారు చంద్రబాబు. వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు. మొన్న ఆ మధ్య పోలవరం ప్రాజెక్టుపై శ్వేత పత్రం విడుదల చేశారు. ఇప్పుడు అమరావతిపై విడుదల చేశారు. అమరావతి పై గత ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో అందరికీ తెలిసిన విషయమే. మూడు రాజధానులు తెరపైకి తెచ్చి.. అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసింది జగన్ సర్కార్. అమరావతి రైతుల త్యాగాలను అవహేళన చేసి ఎంతగా అవమానించిందో అందరికీ తెలిసిన విషయమే. ఒక రకమైన కర్కశంతో ముందుకు సాగిన తీరు రాష్ట్ర ప్రజలకు విధితమే. వైసిపి ఓటమికి ఇది కూడా ఒక కారణం. ఈ నేపథ్యంలో చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రంలో.. అడుగడుగునా జగన్ సర్కార్ వైఫల్యాలు కనిపించాయి.

2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిని ఎంపిక చేసింది. శాసనసభలో అన్ని వర్గాల అభిప్రాయాన్ని సైతం తీసుకుంది. జగన్ అమరావతి రాజధానిని స్వాగతించారు. రైతులు ఇచ్చిన 33 వేల ఎకరాల కంటే అదనంగా సేకరించాలని సూచనలు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మడత పేచి వేశారు. పరిపాలన వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు. అమరావతిని శాసన రాజధానికి పరిమితం చేద్దామని నిర్ణయానికి వచ్చారు. దీనిని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు చేసిన ఉద్యమాన్ని జగన్ అడ్డుకునే ప్రయత్నం చేశారు.

అమరావతి రాజధాని లో టిడిపి ప్రభుత్వం చేసిన నిర్మాణాలను ఉన్నఫలంగా నిలిపివేశారు. ప్రజా వేదిక విధ్వంసంతో పాలనను ప్రారంభించారు. అందుకే గత ప్రభుత్వ హయాంలో అమరావతికి జరిగిన అన్యాయంపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. అక్కడ టిడిపి ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలు, ఒక పద్ధతి ప్రకారం వైసీపీ సర్కార్ చేసిన నిర్వీర్యం వంటి వాటిని వివరించారు. ఇటీవల కూటమి గెలిచిన వెంటనే అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. వందలాది యంత్రాలతో అమరావతి ప్రాంతంలో ముళ్ళ కంపలను తొలగించారు. అమరావతి పురవీధుల్లో విద్యుత్ వెలుగులు తెచ్చారు. అమరావతిలో నిర్మాణాలపై అధికారుల బృందం నివేదిక కూడా ఇవ్వనుంది. ఇంతలో చంద్రబాబు ప్రకటించిన శ్వేత పత్రం ఆలోచింపచేస్తోంది.