Chandrababu : చంద్రబాబు రాజకీయంగా అపర చాణుక్యుడు. ముందుచూపు గల నేత. ఈ విషయం చాలా సందర్భాల్లో నిరూపితమైంది. కొన్నిసార్లు విఫలమైంది కూడా. అయితే ఇలా విఫలమైనప్పుడే తన వ్యూహాలకు పదును పెట్టి విజయాలు అందుకున్న సందర్భాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి మామ స్థాపించిన టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆయన చూపు పదవులపై పడలేదు. పార్టీ పై పడింది. అదే తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బావమరిది హరికృష్ణలు పదవులపై తమ దృష్టిపెట్టారు. కానీ చంద్రబాబుపై మాత్రం పార్టీపై ఫోకస్ పెట్టారు. అనుబంధ విభాగాల నుంచి కింది స్థాయి కేడర్ వరకూ తన చెప్పుచేతల్లోకి తెచ్చుకున్నారు. చంద్రబాబు నేటి స్థితికి అదే కారణమైంది. తిరుగులేని నాయకత్వానికి దోహదపడింది.
అయితే తన ఆలోచనకు ఫస్ట్ టైమ్ 2004లో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నక్సలైట్ల దాడిని సాకుగాచూపి గట్టెక్కాలని చంద్రబాబు భావించారు. తనతో పాటు కేంద్రంలో ఎన్డీఏను సైతం ముందస్తు ఎన్నికలకు పురమాయించారు. అంతులేని సానుభూతి వచ్చి అధికారంలోకి రాగలుగుతానని అంచనా వేశారు. కానీ తానొకటి తలిస్తే జరిగింది ఒకటి అని దారుణ ఓటమిని మూటగట్టుకున్నారు. అటు వాజ్ పేయ్ నేతృత్వంలో ఎన్డీఏను సైతం ఓటమిబాట పట్టించారు. జీవితంలో తాను చేసిన రాజకీయ తప్పిదం అదేనంటూ ఇప్పటికీ చంద్రబాబు బాధపడుతుంటారు.
2018లో ఎన్డీఏ నుంచి వైదొలగడం కూడా చంద్రబాబు చేసిన పెద్ద తప్పిదం. 2014లో రాష్ట్ర విభజనతో అవశేష ఏపీని గాడిలో పెడతారన్న నమ్మకంతో ప్రజలు చంద్రబాబుకు అధికారాన్ని అప్పగించారు. చాలా రకాలుగా నమ్మకం పెట్టుకున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తరహాలో అద్భుతమైన రాజధానిని ఏర్పాటుచేస్తారని ప్రజలు బలంగా భావించారు. కానీ కాలగర్భంలో నాలుగేళ్ల కాలం కరిగిపోయింది. ప్రజల నమ్మకాన్ని, అంచనాలను అందుకోలేకపోయారు. దీనికి కేంద్రం సహాయ నిరాకరణే కారణమని భావించి ఎన్డీఏను వైదొలిగారు. అందుకు తగ్గ మూల్యం చెల్లించుకున్నారు.
ఇప్పుడు ఈ తప్పిదాలన్నీ కళ్లెదుటే కనిపిస్తుండడంతో చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారు. ఆచీతూచీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. పొత్తుల విషయంలో కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. మొన్నటికి మొన్న బీజేపీ అగ్రనేతలతో సమావేశమైన తరువాత బాబు పార్టీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో మెజార్టీ నాయకులు బీజేపీతో పొత్తు వద్దని కోరారు. కానీ బాబు వారిని సముదాయించారు. నాలుగైదు సీట్లు పోతాయి కానీ.. బీజేపీ లేకుంటే జగన్ ను గద్దె దించడం కుదరని పనిగా తేల్చేశారు. ఎన్నికల్లో వ్యవస్థలను జగన్ దుర్వినియోగం చేయకుండా నియంత్రించాలంటే బీజేపీ అవసరం ముఖ్యమని బాబు భావిస్తున్నారు. పైగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరూ కలిసి చెబితేనే ప్రజలు నమ్ముతారని.. అందుకే అందర్నీ ఏకతాటిపైకి తేవాల్సిందేనని తేల్చిచెప్పారు. మొత్తానికైతే తన రాజకీయ అనుభవాన్ని రంగరించి మరీ ఎన్నికలకు చంద్రబాబు సిద్ధపడుతున్నారన్న మాట.