CM Chandrababu: గత ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనిపించాయి. సంక్షేమానికి పెద్ద పీట వేసిన జగన్ సర్కార్ అభివృద్ధిని మరిచిపోయిందన్న విమర్శ ఉంది. ముఖ్యంగా రహదారుల విషయంలో కనీసం పట్టించుకోలేదన్న అపవాదు అయితే మాత్రం జగన్ ప్రభుత్వం పై ఉండేది. ఏ రహదారి చూసినా ఏమున్నది గర్వకారణం అనేలా పరిస్థితి కొనసాగింది. చివరకు ఇతర రాష్ట్రాల నేతలు ఏపీకి వచ్చి మరి ఎద్దేవా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఎన్నికల్లో జగన్ ఓటమికి ప్రధాన కారణం రహదారులే.అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు రహదారుల పైనే దృష్టి పెట్టారు.సంక్షేమ పథకాల అమలు కంటే అభివృద్ధి పనులే కీలకమని భావించారు. రహదారుల బాగు కోసం పాట్ హోల్ ఫ్రీ ఏపీ పేరుతో ఓ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. సంక్రాంతి నాటికి రాష్ట్రంలో గుంతలు లేని రహదారులు ఉండాలని భావిస్తున్నారు.ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు తమ నియోజకవర్గాల్లో రహదారుల బాగుకోసం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇదే క్రమంలో తాజాగా ఎమ్మెల్యేలకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
* పండగ సమీపిస్తున్న వేళ
సంక్రాంతి సమీపిస్తోంది. ఏపీలో ముఖ్యమైన పండుగ ఇదే. ఎంత దూరంలో ఉన్నా స్వగ్రామాలకు తరలి వస్తారు. ఇంకా పండుగకు మూడు వారాల వ్యవధి మాత్రమే ఉంది. ఎక్కడెక్కడ అయితే రహదారులు బాగా లేదో.. వెనువెంటనే మరమత్తులు చేయించాలని టిడిపి ఎమ్మెల్యేలకు చంద్రబాబు గట్టిగానే చెప్పినట్లు తెలుస్తోంది. మరో అడుగు ముందుకేసి ఈ సంక్రాంతికి రాష్ట్రానికి వచ్చేవారు ఎక్కడైనా రోడ్లు బాగాలేదని సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేను బాధ్యుడిని చేస్తానని తెగేసి చెప్పినట్లు సమాచారం. దీంతో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో రహదారుల పరిస్థితిని తెలుసుకుంటున్నారు. వాటిని బాగు చేసేందుకు సిద్ధపడుతున్నారు.
* ఆ పరిస్థితి రాకూడదనే
వైసిపి ప్రభుత్వ హయాంలో ఎక్కువగా విమర్శలకు గురైంది రోడ్ల అంశమే. ఏ రహదారి చూసినా గుంతల మయంగా కనిపించడం.. అప్పట్లో ప్రత్యర్థులకు ప్రచార అస్త్రంగా మారింది. ఇప్పుడు మరోసారి విపక్షాలకు ఆ అవకాశం ఇవ్వకూడదని చంద్రబాబు భావిస్తున్నారు. వైసిపి హయాంలో రహదారుల గుంతల్లో వరి నాట్లు వేయడం, మంచాలు వేసుకుని నిరసన తెలపడం వంటి చర్యలతో వైసిపి సర్కార్ పై వ్యతిరేకత పెంచడంలో కూటమి పార్టీలు సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు టిడిపి ప్రభుత్వం పై అటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలను పిలిచి మరి జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది.