Bhogapuram Airport controversy: జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy )ఒక మాయా ప్రపంచంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పింది అందరూ నమ్ముతారని భావిస్తున్నారు. కానీ సమాజాన్ని వాచ్ చేసేవారు ఉంటారని ఆయన గుర్తించలేకపోతున్నారు. తనను వ్యతిరేకించేవారు మరింత పెరిగిపోతారు అని గుర్తించడం లేదు. ఇప్పుడు కూడా నిజాలు మాట్లాడలేకపోతున్నారు. తాను ఏది చెబితే అదే ప్రజలు నమ్ముతారని భావిస్తున్నారు. ఈరోజు ప్రెస్ మీట్ చూస్తే అలానే అర్థమవుతోంది. వారంలో మూడు రోజులపాటు తాడేపల్లి కి వస్తున్న ఆయన.. నాలుగు రోజులపాటు బెంగళూరులో ఉంటున్నారు. గురువారం సాయంత్రం బెంగళూరు బయలుదేరుతాను అనగా మీడియా ముందుకు వచ్చి వారాంతపు కామెంట్స్ చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఏదైనా ప్రజలకు మేలు జరిగింది అంటే అది తన వల్లనని.. కీడు జరిగితే అది చంద్రబాబు వల్ల అని చెబుతున్నారు.
క్రెడిట్ కొట్టేయాలని..
ఇప్పుడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం( bhogapuram International Airport) తన చొరవ వల్లే పూర్తయిందని సెలవిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అది ఎలా సాధ్యమో ఆయనకే తెలియాలి. ఎందుకంటే ప్రతిపాదించింది చంద్రబాబు. టెండర్లు పూర్తి చేసింది చంద్రబాబు. పునాదిరాయి వేసింది చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి చేసిందల్లా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పనులు నిలిపివేత. భూములకు సంబంధించిన అంశాలను చూపించి జిఎంఆర్ పై ఒత్తిడి చేయించారు. సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు మరోసారి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఒకవైపు, రామ్మోహన్ నాయుడు ఇంకో వైపు చొరవ చూపి భోగాపురం ఎయిర్ పోర్టును పూర్తి చేయిస్తే నిస్సిగ్గుగా తన పని అని చెబుతున్నారు.
అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్ట్.. రాయలసీమకు( Rayalaseema ) సంబంధించి ఎత్తిపోతల పథకం పోతిరెడ్డిపాడును చంద్రబాబు అడ్డుకున్నారు అని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దానికి ఆయన చెబుతున్న సాక్ష్యం తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కామెంట్స్. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు అనేది స్వయానా జగన్మోహన్ రెడ్డి. విచిత్రం ఏమిటంటే ఆయన ఎటువంటి అనుమతులు తీసుకోలేదు కేంద్ర సంస్థల నుంచి. చిన్న ఇల్లు కడితేనే అనేక రకాల అనుమతులు తీసుకుంటాం. అటువంటిది భారీ ప్రాజెక్టుకు జగన్మోహన్ రెడ్డి అనుమతులు తీసుకోలేదంటే దానిని ఏమనాలి? చిత్తశుద్ధి లేదనాలి. ఎలాగూ అనుమతులు లేవు కాబట్టి కేంద్ర సంస్థలు ఆ పనులను నిలిపివేయమని ఆదేశాలు ఇచ్చాయి. అయినా సరే పెద్దిరెడ్డి కంపెనీకి 900 కోట్ల రూపాయలు చెల్లింపులు చేసేసారు. తర్వాత మూడు సంవత్సరాలు పట్టించుకోలేదు. ఇప్పుడేదో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారని దానిని సాక్ష్యంగా చూపి చంద్రబాబుపై బురద జల్లుతున్నారు. 18 నెలలు అయింది అనుమతులు తీసుకు రావచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. కానీ తాను అనుకున్న ప్రాజెక్టును మాత్రం గుర్తించలేదు జగన్మోహన్ రెడ్డి. తన వైఫల్యాన్ని ఇప్పుడు చంద్రబాబుపై నెడుతున్నారు. తన వారాంతపు ప్రెస్ మీట్ ఈ వారం మాత్రం.. అంతా చంద్రబాబుపై నెపం వేసేందుకే అన్నట్టు ఉంది.