Amaravati farmers: ఏదైనా అనుకుంటే చంద్రబాబు( CM Chandrababu) చేస్తారు. అందుకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ముందుకే వెళ్తారు. ఒక్కోసారి రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని తెలిసినా వెనక్కి తగ్గరు. అమరావతిలో రెండో విడత భూ సేకరణలో ఇది స్పష్టమవుతోంది. నిన్ననే అమరావతిలో రెండో విడత భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభం అయింది. ఇప్పటికే దాదాపు 35 వేల ఎకరాలకు పైగా మొదటి విడతలో సేకరించారు. కానీ గ్లోబల్ సిటీగా అమరావతికి ఈ భూమి చాలదు అనేది చంద్రబాబు ముఖ్య ఉద్దేశం. అందుకే అదనంగా 20వేల ఎకరాల వరకు సేకరించాలని నిర్ణయించారు. అయితే దీనిపై అనేక రకాల అభ్యంతరాలు వచ్చాయి. మంత్రి మండలి సమావేశంలో సైతం పవన్ కళ్యాణ్ అభ్యంతరాలు తెలిపినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం మాత్రం రెండో విడత భూ సమీకరణకు సిద్ధపడింది.
అభద్రతా భావం
ఇప్పటికే తొలి విడతగా భూములు ఇచ్చిన రైతుల్లో ఒక రకమైన అభద్రతాభావం ఉంది. తమ త్యాగాలకు విలువ లేకుండా పోయిందన్న వారు ఉన్నారు. రిటర్నబుల్ ఫ్లాట్స్( returnble flats) విషయంలో కూడా తమకు సరైన న్యాయం దక్కలేదన్న వారు ఉన్నారు. కానీ అది రాజకీయంగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వాస్తవ పరిస్థితి ఇంకోలా ఉంది. ఇప్పటికీ అమరావతి రైతులు చంద్రబాబు విషయంలో సానుకూలంగా ఉంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వైఖరి ఐదేళ్లుగా చూశారు. తమ విషయంలో ఎంతలా కర్కసంగా వ్యవహరించారో వారికి తెలియనిది కాదు. అందుకే చంద్రబాబుకు వ్యతిరేకంగా వారు వెళ్లే పరిస్థితి లేదు. అయితే చిన్న చిన్న సమస్యలు వారికి ఉన్నాయి. సాంకేతిక పరమైన అంశాలు కూడా ఉన్నాయి. వాటికి మాత్రం పరిష్కార మార్గం చూపించాలంటున్నారు. అయితే ఇప్పుడు రెండో విడత భూసేకరణ చేస్తుండడం పై మాత్రం అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుతం అమరావతిలో భూముల ధరలు తగ్గాయి. అదనపు భూసేకరణ ఉంటుందని తెలియడంతోనే ఇక్కడ భూములు కొనుగోలు చేసేందుకు ఎవరు ముందుకు రాలేదు. ఈ విషయంలో మాత్రం మొదటి విడత భూములు ఇచ్చిన వారిలో చిన్నపాటి అసంతృప్తి ఉంది. కానీ చంద్రబాబును వ్యతిరేకించే స్థాయి, ఆ పరిస్థితి మాత్రం అమరావతి రైతుల్లో లేదు. ఎందుకంటే ఆయనకు మించిన ఆప్షన్ వారికి ఇప్పుడు దొరకడం లేదు.
సరికొత్త డిమాండ్లు…
అయితే రెండో విడత భూ సేకరణకు దిగిన ప్రభుత్వము ముందు రైతులు కొన్ని డిమాండ్లను ముందు ఉంచారు. మంత్రి నారాయణ( Minister Narayana) ఆధ్వర్యంలో వద్దమాను గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. కానీ భూములు ఇచ్చేందుకు రైతులు కొన్ని రకాల షరతులు పెట్టారు. ఇప్పటివరకు ఎకరా భూమికి 30 వేల రూపాయలు ఏడాదికి కౌలు రూపంలో అందిస్తున్నారు. ఇకముందు ఆ మొత్తాన్ని రూ.40000 కు పెంచాలని డిమాండ్ చేశారు. మరోవైపు చిన్న సన్న కారు రైతులు కావడంతో తమకు రుణమాఫీ కావాలని వారు డిమాండ్ చేశారు. ఒకవేళ అనుకున్న స్థాయిలో రిటర్నబుల్ ఫ్లాట్స్ అభివృద్ధి చేయకపోతే మూడేళ్లలో ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని నిబంధన పెట్టారు. అయితే ఈ మూడింటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. రైతుల వద్ద నుంచి ఈ డిమాండ్స్ రాగానే మంత్రి నారాయణ నేరుగా సీఎం చంద్రబాబుకు ఫోన్ చేశారు. కౌలు విషయంలో 40 వేల రూపాయలకు పెంచడం పై ఎటువంటి అభ్యంతరాలు లేవు. చిన్న రైతులు కావడంతో లక్ష యాభై వేల రూపాయలకు సంబంధించి రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జనవరి 6 వరకు తీసుకున్న ఈ రుణాలకు సంబంధించి వర్తింపజేశారు. రిటర్నబుల్ ఫ్లాట్స్ విషయంలో సైతం ఐదు లక్షల రూపాయలను చెల్లించేందుకు అంగీకారం కూడా తెలిపారు.
పెద్దగా అభ్యంతరాలు లేవు..
అయితే మొదటి విడత ఈ వర్తింపులు లేవు. దీంతో వారి నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతుందన్న అనుమానాలు ఉన్నాయి. అయితే తొలి విడత భూ సేకరణలో ఎక్కువ మంది పెద్ద రైతులు ఉన్నారు. పైగా ఐదేళ్లపాటు వైసీపీ హయాంలో ఇబ్బంది పడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వీరికి కౌలుకు సంబంధించి పెండింగ్ బిల్లులు కూడా విడుదలయ్యాయి. అందుకే ఇప్పుడు ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. ఎందుకంటే ఇప్పుడు ఇబ్బంది పెడితే ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం ఉండదు. పైగా జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడే ఉద్దేశం కూడా వారికి లేదు. అందుకే ఈ విషయంలో వారి నుంచి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కావు. అమరావతి విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ రాజకీయం చేసినా ప్రజలు నమ్మరు. అందుకే చంద్రబాబు ఈ విషయంలో ధైర్యంగా ముందడుగు వేయగలుగుతున్నారు.