Raghuramakrishnam Raju : రఘురామరాజుకు చంద్రబాబు షాక్

Raghuramakrishnam Raju అటు మంత్రి పదవి లేక, ఇటు స్పీకర్ పదవి లేక, ఒక సాధారణ ఎమ్మెల్యే మాదిరిగా కొనసాగాల్సి ఉంటుందని రఘురామకృష్ణంరాజు బాధపడుతున్నట్లు సమాచారం.

Written By: Dharma, Updated On : June 18, 2024 5:21 pm

Chandrababu shocked Raghuramakrishnam Raju

Follow us on

Raghuramakrishnam Raju : ఈసారి కొత్తవారికి చంద్రబాబు క్యాబినెట్లో చోటిచ్చారు. అందరి అంచనాలకు భిన్నంగా సీనియర్లను పక్కనపెట్టి జూనియర్లకు ఛాన్స్ ఇచ్చారు. మొదటిసారి గెలిచిన పదిమందికి మంత్రి పదవులు దక్కాయి. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్న పవన్ కళ్యాణ్ కు ఏకంగా డిప్యూటీ సీఎం పదవి దక్కింది. వివిధ సమీకరణలో భాగంగా చంద్రబాబు చాలామంది సీనియర్లను పక్కన పెట్టారు. కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, పరిటాల సునీత, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి.. ఇలా ఒకరేమిటి చాలామందికి మంత్రి పదవులు దక్కలేదు. ఇక వైసిపి నుంచి టిడిపిలో చేరిన ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారధిలకు మంత్రి పదవులు దక్కాయి. కానీ వైసీపీలో ఉంటూ రెబెల్ గా మారి.. టిడిపి కూటమికి సహకరించిన రఘురామకృష్ణం రాజకు మాత్రం మంత్రి పదవి దక్కలేదు.

2019లో నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు రఘురామకృష్ణంరాజు. ఎంపీగా గెలిచిన ఆయన 6 నెలలకే వైసీపీ నాయకత్వానికి దూరమయ్యారు. ఎదురు తిరిగారు. నిత్యం వైసిపి ప్రభుత్వ విధానాలపై రచ్చబండ పేరుతో రచ్చ రచ్చ చేశారు. సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా తీవ్ర విమర్శలు చేసేవారు. ఈ ఎన్నికల్లో బిజెపి నుంచి నరసాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తానని భావించారు. కానీ బిజెపి హై కమాండ్ ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో చివరి నిమిషంలో చంద్రబాబు స్పందించారు. టిడిపిలో చేర్చుకొని ఉండి అసెంబ్లీ సీటును కేటాయించారు. ఈ ఎన్నికల్లో గెలిచిన రఘురామకృష్ణం రాజు తనకు మంత్రి పదవి కానీ, స్పీకర్ పదవి కానీ కేటాయిస్తారని ఆశించారు. కానీ ఆ రెండు పదవులు దక్కలేదు. దీంతో రఘురామకృష్ణంరాజు అనుచరులు అసంతృప్తితో ఉన్నారు.

వాస్తవానికి తనకు స్పీకర్ పదవిపై ఆసక్తి ఉందని రఘురామకృష్ణంరాజు తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు. గత ఐదు సంవత్సరాలుగా జగన్ సర్కార్ రఘురామకృష్ణంరాజును వెంటాడింది. కేసులతో ఉక్కిరి బిక్కిరి చేసింది. ఒకానొక దశలో అరెస్టు చేసి పోలీసులు చేయి చేసుకున్నట్లు కూడా రఘురామకృష్ణం రాజు ఆరోపించారు. జగన్ అవినీతిపై రఘురామ కోర్టుల్లో కేసులు కూడా వేశారు. తనకు జగన్ నుంచి ఎదురైన అవమానాలను ఎదుర్కోవాలంటే.. ఆయనతోనే అధ్యక్షా అని పిలిపించుకోవాలని రఘురామ భావించారు. ఇదే విషయాన్ని బయట పెట్టారు. ఇంకోవైపు మంత్రివర్గంలో క్షత్రియులకు స్థానం లేకుండా పోయింది. అది రఘురామరాజు కోసమే ఖాళీ చేశారని ప్రచారం జరిగింది. కానీ చంద్రబాబు మాత్రం దానిపై క్లారిటీ ఇవ్వలేదు. రఘురామకృష్ణం రాజు కోసమే అది ఖాళీగా ఉంచామని సంకేతాలు పంపించలేదు. ఇంకోవైపు స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అటు మంత్రి పదవి లేక, ఇటు స్పీకర్ పదవి లేక, ఒక సాధారణ ఎమ్మెల్యే మాదిరిగా కొనసాగాల్సి ఉంటుందని రఘురామకృష్ణంరాజు బాధపడుతున్నట్లు సమాచారం.