Rushikonda Palace : రుషికొండ ప్యాలెస్ ను అలా వాడుకోనున్న కూటమి సర్కార్!

వైసిపి అధికారానికి దూరమైంది. అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడింది. అందులో భాగంగా విశాఖలో భారీ నిధులతో భవనాలను నిర్మించింది. కానీ వాటిని ఎందుకు నిర్మించారో చెప్పకుండానే నిధులు ఖర్చు చేసింది.

Written By: Dharma, Updated On : October 26, 2024 11:34 am

Rushikonda Palace

Follow us on

Rushikonda Palace : రుషికొండ భవనాలను సినిమా షూటింగ్ ల కోసం వినియోగించనున్నారా? షూటింగులకు అనువైన ప్రాంతాలుగా గుర్తించారా? అలా చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైసిపి హయాంలో 500 కోట్ల రూపాయలతో రుషికొండపై సువిశాలమైన భవనాలు నిర్మించిన సంగతి తెలిసిందే. పర్యాటక, పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకంగా అక్కడ భవనాలు నిర్మించారన్నది వైసీపీ ప్రభుత్వం పై వచ్చిన ఆరోపణ. అయినా సరే జగన్ లెక్క చేయకుండా అక్కడ భవనాలను నిర్మించారు. రెండోసారి అధికారంలోకి వస్తే అక్కడ నుంచి పాలన చేస్తానని చెప్పుకొచ్చారు. దీంతో అది ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం కట్టిన భవనాలు అని.. వివిధ విభాగాధిపతులు అక్కడ ఉంటారని అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సైతం.. సీఎం క్యాంప్ ఆఫీసునకు అనువైన భవనాలుగా గుర్తించింది. అదే సమయంలో మంత్రుల కార్యాలయాల కోసం భవనాల అన్వేషణ కూడా జరిగింది. దీంతో అది సీఎం క్యాంప్ ఆఫీస్ కోసం కట్టిన భవనమేనని నిర్ధారణ అయ్యింది. అయితే ఇంతలో ప్రభుత్వం మారడం.. కూటమి అధికారంలోకి రావడం జరిగిపోయింది. దీంతో ఇక్కడ సువిశాల భవనాలు, వాటిలో ఖరీదైన నిర్మాణాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ భవనాలను కూటమి ప్రభుత్వం ఎలా వినియోగించుకుంటుంది? అన్నది హాట్ టాపిక్ గా మారింది. అయితే తాజాగా జరిగిన పరిస్థితులు చూస్తుంటే సినీ రంగం విస్తరణకు కూటమి ప్రభుత్వం శరవేగంగా ఆలోచనలు చేస్తోంది. ఈ తరుణంలో రుషికొండ భవనాలను సినిమా షూటింగ్ స్పాట్లుగా వాడుకుంటారని తెలుస్తోంది.

* పవన్ పరిశీలన
ఇటీవల రిషికొండ భవనాలను డిప్యూటీ సీఎం పవన్ పరిశీలించారు. విపక్షంలో ఉన్నప్పుడు ఇదే భవనాల పరిశీలనకు పవన్ వచ్చారు. కానీ అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో క్షుణ్ణంగా పరిశీలించారు పవన్ కళ్యాణ్. మరోవైపు విశాఖలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సమీక్షించారు. ఏపీకి తెలుగు చిత్ర పరిశ్రమ తరలిరావాలని కోరారు. ఏపీలో చాలా రకాల సినిమా షూటింగ్ స్పాట్లు ఉన్నాయని గుర్తు చేశారు. నేరుగా దర్శక నిర్మాతలతో మంత్రి ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే అది రుషికొండ భవనాల కోసమేనని సమాచారం. వాటిని సినిమా షూటింగ్ స్పాట్లుగా వాడుకోవాలని సూచించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

* విశాఖ షూటింగ్ స్పాట్స్
ఇప్పటికే విశాఖ నగరంలో సినిమాల చిత్రీకరణ జరుగుతోంది. మరోవైపు రామానాయుడు స్టూడియో సైతం ఉంది. ఎన్నెన్నో స్పాట్లు కూడా ఉన్నాయి. రిషికొండ భవనాలను అదే మాదిరిగా వినియోగిస్తే సినిమా చిత్రీకరణ పెరిగే అవకాశం ఉంది. అందుకే మంత్రి కందుల దుర్గేష్ సమీక్షలు జరపడం, పవన్ కళ్యాణ్ సైతం ఆ భవనాలను పరిశీలించడంతో.. ఈ అనుమానాలన్నీ నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి అయితే రుషికొండ భవనాలను కూటమి ప్రభుత్వం ఎలా వాడుకుంటుందోనన్న చర్చ జరిగింది చివరకు చిత్ర పరిశ్రమ విస్తరణ కోసం అని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. అదే జరిగితే విశాఖ కేంద్రంగా తెలుగు సినీ పరిశ్రమ విస్తరణకు అవకాశం కలిగినట్టే.