YCP MP Vijayasaireddy : వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విశాఖ జిల్లా భీమిలిలో విజయసాయిరెడ్డి కుమార్తె నేహా రెడ్డి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయడం ప్రారంభించింది. సి ఆర్ జెడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఈ కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారని.. హైకోర్టు ఆదేశాలతో కూల్చివేస్తున్నట్లు జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. భీమిలి లోని సర్వేనెంబర్ 1516, 1517, 1519, 15 23లో నేహా రెడ్డి కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు. ఇవి అక్రమ కట్టడాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో తాజాగా కోర్టు ఉత్తర్వులతో నిర్మాణాలు తొలగిస్తున్నట్లు జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. గతంలోనే ఈ భూముల వ్యవహారం పై అనేక ఆరోపణలు వచ్చాయి. విజయసాయి రెడ్డి సైతం క్లారిటీ ఇచ్చారు. అయినా సరే కోర్టు ఆదేశాలతో నిర్మాణాలను తొలగించినట్లు అధికారులు చెప్పుకొస్తున్నారు. దీంతో వైసీపీ కీలక నేతకు ఎదురు దెబ్బ తగిలినట్లు అయ్యింది. గతంలో వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ గా విజయసాయిరెడ్డి పనిచేశారు. ఆ సమయంలో విశాఖలో భూములను అడ్డగోలుగా దోచుకున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏకంగా విజయసాయిరెడ్డి కుమార్తె చేపట్టిన నిర్మాణాలను తొలగించడం విశేషం.
* సి ఆర్ జెడ్ నిబంధనల ఉల్లంఘన
భీమిలి బీచ్ దగ్గర సముద్రానికి అతి సమీపంలో సి ఆర్ జెడ్ ఉంది. ఈ నిబంధనలు అనుసరించి అక్కడ నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహా రెడ్డి మాత్రం 249 మీటర్ల కాంక్రీట్ ప్రహరీ గోడ నిర్మించారు. దీనిపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ గతంలో ఫిర్యాదు చేశారు. హైకోర్టును ఆశ్రయించారు. వీటి కూల్చివేత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు వివరిస్తూ నివేదికను సమర్పించాలని హైకోర్టు జీవీఎంసీ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 11 కు వాయిదా వేసింది. అయితే ఇప్పుడు కోర్టు విచారణ వాయిదా గడువు సమీపిస్తున్న నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు నిర్మాణాన్ని తొలగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
* హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు
తీర ప్రాంతంలో కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదంటూ గతంలో హైకోర్టు ఆదేశించిన సందర్భాలు ఉన్నాయి. కానీ అధికార బలంతో గత ప్రభుత్వ హయాంలో నేహా రెడ్డి ఈ ప్రహరీ నిర్మాణం చేపట్టారు. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో జీవీఎంసీ అధికారులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లో ఆక్రమణలు తొలగించాలని.. లేదంటే తామే తొలగిస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆమె నుంచి స్పందన లేకపోవడంతో బుధవారం ఉదయం జెసిబి లతో అక్కడికి చేరుకున్న అధికారులు ప్రహరీ గోడను కూల్చివేశారు. దీంతో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి షాక్ తగిలినట్లు అయ్యింది.
* వైసీపీ నేతల్లో ఆందోళన
వైసిపి ప్రభుత్వం విశాఖను పాలన రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రాజధాని తప్పకుండా అవుతుందని భావించిన వైసీపీ నేతలు భారీ భూదందాకు తెరతీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా విజయసాయి రెడ్డి పై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులకు చెందిన నిర్మాణాలు తొలగిస్తుండడంతో వైసిపి నేతల్లో గుబులు ప్రారంభమైంది.