Chandrababu: వాలంటీర్ల విషయంలో జరుగుతున్న రాజకీయం అంతా ఇంతా కాదు. ఎన్నికల నేపథ్యంలో వారి సేవలను వినియోగించకూడదని ఎలక్షన్ కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అప్పటినుంచి రగడ ప్రారంభమైంది. ఈ ఆదేశాలు రావడం వెనుక చంద్రబాబు ఉన్నారని వైసీపీ ఆరోపించడం ప్రారంభించింది. సందట్లో సడేమియా అన్నట్టు ఈనెల పింఛన్ల పంపిణీ ఆలస్యంగా ప్రారంభమైంది. దీనికి కూడా చంద్రబాబు కారణమని వైసిపి ఆరోపించింది. దీంతో కొంతవరకు డ్యామేజ్ జరిగిన విషయాన్ని గుర్తించిన చంద్రబాబు.. దిద్దుబాటు చర్యలను ప్రారంభించారు. పింఛన్ల ఆలస్యానికి వైసీపీ కారణమని.. ఈనెల మూడున పింఛన్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ముందుగానే ప్రకటించిందని.. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని టిడిపి ఎదురుదాడి చేసింది. అటు చంద్రబాబు సైతం స్వరం మార్చారు. వాలంటీర్ల విషయంలో తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు.
వాస్తవానికి ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు చాలా రకాల హామీలు ఇచ్చారు. కానీ జగన్ లైట్ తీసుకున్నారు. సంక్షేమ పథకాలు అమలు విషయంలో తనకున్న క్రెడిబిలిటీ.. చంద్రబాబుకు లేదన్నది జగన్ అభిప్రాయం. అందుకే చంద్రబాబు ఎన్ని రకాల పథకాలు ప్రకటించిన డోంట్ కేర్ అన్నట్టు జగన్ వ్యవహరించారు. తొలుత రైతు రుణాలపై చంద్రబాబు హామీ ఇచ్చారు. ఒక్క సంతకం తో తీసేస్తానని ప్రకటించారు. నిజానికి ఇది సంచలన ప్రకటన అయినా.. జగన్ పెద్దగా పట్టించుకోలేదు. సామాజిక పింఛన్ మొత్తాన్ని మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచుతానని కూడా చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ దీన్ని కూడా జగన్ పెద్దగా పట్టించుకోలేదు. మూడు వేల పింఛన్ కే ఏపీని శ్రీలంక మాదిరిగా జగన్ మార్చారని ఆరోపించారని.. ఇప్పుడు ఎలా 4000 రూపాయలు ఇస్తారని విమర్శలకే పరిమితమయ్యారు. అటు టిడిపి సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించినా.. ప్రజలు నమ్మరు అన్న భావన అటు జగన్ తో పాటు ఇటు వైసీపీ నేతల్లో ఉంది.
అయితే తాజాగా చంద్రబాబు చేసిన ఒక ప్రకటన మాత్రం వైసీపీలో గుబులు రేపుతోంది. కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తామని.. వారికి ఇప్పటివరకు ఇచ్చిన 5000 రూపాయల గౌరవ వేతనాన్ని 10 వేల రూపాయలకు పెంచుతామని చంద్రబాబు ప్రకటించారు. దయచేసి వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయవద్దని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అయితే ఇంతవరకు వాలంటీర్ల విషయంలో తప్పటడుగులు వేసిన చంద్రబాబు.. ఇప్పుడు యూ టర్న్ తీసుకోవడంతో వైసీపీలో చిన్నపాటి కుదుపు ఏర్పడింది. అటు వాలంటీర్లలో సైతం ఒక రకమైన ఆలోచన ప్రారంభమైంది. టిడిపి అధికారంలోకి వస్తే.. తమను కొనసాగిస్తామన్న హామీ వారిలో చేంజ్ కు కారణమవుతోంది. దీంతో చాలా గ్రామాల్లో వాలంటీర్లు స్తబ్దతగా ఉండిపోతున్నారు. న్యూట్రల్ గా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని గమనిస్తున్న వైసిపి కొంచెం కంగారు పడుతోంది. చంద్రబాబు ఎన్నో రకాల హామీలు ఇచ్చారు కానీ.. తమ మానస పుత్రిక ఆయి న వాలంటీర్ వ్యవస్థ పై గట్టిగా దెబ్బ కొట్టారు అన్న కామెంట్స్ వైసీపీ నుంచి వినిపిస్తోంది. పోలింగ్ కు ఇంకా 35 రోజుల సమయం ఉంది. చంద్రబాబు ఇచ్చిన ఈ హామీ వాలంటీర్లలోకి బలంగా వెళితే మాత్రం.. వైసీపీకి వారి నుంచి అంతగా సహకారం అందదు. చంద్రబాబుకు కూడా కావాల్సింది అదే. అందుకే ఆయన అదును చూసి వాలంటీర్ల వ్యవస్థపై ఒక రాయి విసిరారు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.