Chandrababu vs Revanth Reddy: ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ బనకచర్ల (Bana kacherla )ప్రస్తావన వచ్చింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. తమ పాత వాదనలని వినిపించారు. బనకచర్లతో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని చంద్రబాబు పునరుద్ఘాటించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం స్పందించారు. నీటి వాటా హక్కులపై రాజీలేదని తేల్చి చెప్పారు. కొద్ది రోజుల కిందట బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని తెరపైకి తెచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. కృష్ణా, గోదావరి మిగులు జలాలను సముద్రంలోకి వృధా పోకుండా.. బనకచర్ల ప్రాజెక్టుకు తరలిస్తే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని.. తప్పకుండా ఈ ప్రాజెక్టును నిర్మిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. అది మొదలు రచ్చ రచ్చగా మారుతోంది. అయితే తెలంగాణలో ఇది రాజకీయ వివాదానికి దారితీసింది.
తెలంగాణ అభ్యంతరాలతో..
ఏపీ సీఎం చంద్రబాబుతో( AP CM Chandrababu) తెలంగాణ సీఎం రేవంత్ కు మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ ప్రాజెక్టు ప్రస్తావన తీసుకొచ్చేసరికి తెలంగాణలో రేవంత్ ప్రత్యర్థులు ఆరోపణలు చేయడం ప్రారంభించారు. రేవంత్ సహకారంతోనే చంద్రబాబు ఆ ప్రాజెక్టు ఆలోచన తెరపైకి తెచ్చారని ఆరోపించారు. రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్న బిఆర్ఎస్ ఈ అంశాన్ని తీసుకొని గొంతు ఎత్తడం ప్రారంభించింది. అయితే బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో అనేక రకాల అంశాలను తెరపైకి తెచ్చారు. తాము ఒప్పుకోమని కూడా చెప్పుకొచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రం సైతం ఈ ప్రాజెక్టు విషయంలో నిస్సహాయత వ్యక్తం చేసింది. ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులను నిరాకరించింది. అయితే కేవలం తెలంగాణ నుంచి వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటినుంచి ఈ అంశం విషయంలో ఇరు రాష్ట్రాలు సైలెంట్ గా ఉన్నాయి.
Also Read: పంద్రాగస్టు వేడుకల్లో షాక్ ఇచ్చిన రేవంత్.. చంద్రబాబు ఏం చేస్తారో?
వరద భరించాలా?
అయితే ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రసంగాలు చేశారు. ఈ క్రమంలోనే బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని మరోసారి గుర్తు చేశారు. బనకచర్లతో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎవరు అభ్యంతరం చెప్పాల్సిన పనిలేదని.. సముద్రంలో వృధాగా పోయే నీటిని మాత్రమే వాడుకుంటామని తేల్చి చెప్పారు. ఎక్కువ రాష్ట్రాల వరద నీటితో నష్టాలను భరిస్తున్నామని.. అదే వరద నీటిని వాడుకుంటాం అంటే అభ్యంతరమేంటి అని చంద్రబాబు ప్రశ్నించారు. వరదను భరించాలి కానీ.. ఆ నీటిని వాడుకోవద్దా? అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో చంద్రబాబు కామెంట్స్ వైరల్ అయ్యాయి.
తెలంగాణ అవసరాలు తీరితేనే..
మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy ) సైతం ఈ అంశంపై వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల విషయంలో ఏపీ వాదనపై కౌంటర్ ఇచ్చారు. నదుల్లో నీటి వాటా హక్కు పై రాజీలేదని తేల్చి చెప్పారు. తెలంగాణకు రావాల్సిన నీళ్ల వాటా దక్కించుకుంటాం అన్నారు. మన అవసరాలు తీరాక మాత్రమే మిగతా రాష్ట్రాలకు నీరు అందిస్తామని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం లక్ష కోట్లతో కట్టిన కాలేశ్వరం కూలిపోయిందని విమర్శించారు. ఇప్పటికే బనకచర్లపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం పతాక స్థాయికి చేరుకున్న తరుణంలో.. ముఖ్యమంత్రులు తమ పంతాన్ని మరోసారి ప్రదర్శించడం విశేషం.