Ramoji Rao Passed Away: సక్సెస్ కు చిరునామా రామోజీరావు. చేసింది ఏ పని అయినా పక్కా ప్రణాళికతో చేస్తారు. అనుకున్నది సాధిస్తారు. పచ్చళ్ళ వ్యాపారంతో ప్రారంభమైన ప్రస్థానం.. తెలుగు మీడియా రంగంలో రారాజుగా వెలుగొంది.. రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకుంది. రాష్ట్ర విభజన తరువాత ఏపీకి రాజధానిగా అమరావతి ఖరారు వెనుక రామోజీరావు కీలక పాత్ర పోషించారు. 2014లో నవ్యాంధ్రప్రదేశ్ కు చంద్రబాబు సీఎం అయ్యారు. కొత్త రాజధాని ఏర్పాటుపై నాడే శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇచ్చింది. నాడు ఏపీలోని 13 జిల్లాలకు సమదూరంగా ఉండేలా విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ప్రకటన చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. అసెంబ్లీలో ప్రతిపాదించారు. అన్ని పక్షాలు అంగీకరించాయి.
ఎంతో సదుద్దేశంతో, సమున్నత ఆశయంతో అమరావతి రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించారు చంద్రబాబు. నాడు రామోజీ సూచన మేరకే సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. అందుకు సంబంధించి మాస్టర్ ప్లాన్స్ సిద్ధమైంది. అయితే పనులు ప్రారంభించిన సమయంలో ఏపీ ప్రజలు ప్రభుత్వాన్ని మార్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పరిస్థితి నిర్వీర్యంగా మారింది. గత ఐదు సంవత్సరాలుగా అమరావతి విషయంలో జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతికి మంచి రోజులు వచ్చాయి. కానీ ఈ సమయంలో అమరావతి కోసం పరితపించిన రామోజీరావు మృతి జీర్ణించుకోలేనిది. అమరావతి విషయంలో రామోజీరావు అంకిత భావాన్ని బయటపెట్టారు చంద్రబాబు.
చంద్రబాబు అమరావతి రాజధానిని ఖరారు చేసిన సమయంలో రామోజీరావు తన పత్రికలో ప్రత్యేక కాలం రాసకొచ్చారు. ఏపీ భవిష్యత్తు రాజధాని ఎలా ఉండాలో.. ప్రజల ఆకాంక్షలు ఏంటో వివరించే ప్రయత్నం చేశారు. రాజధానిని అమరావతిగా నామకరణం చేశారు. ఆ పేరుని చంద్రబాబు ప్రభుత్వం నాడు రాజధానికి ఖరారు చేసింది. ఈ పేరును రామోజీ బహిరంగంగానే తన పత్రిక ద్వారా సూచించారు. రామోజీరావు సూచించిన అమరావతి ఇప్పుడు తిరిగి ఏపీ రాజధానిగా నిలవబోతోంది. నాడు రామోజీ పరిశోధన చేసి ఏపీ రాజధానిగా అమరావతి పేరు బాగుంటుందని చెప్తే.. అందరి అభిప్రాయంతో ఆ పేరు ఖరారు చేసినట్లు తాజాగా చంద్రబాబు వెల్లడించారు. అయితే ఇప్పుడు చంద్రబాబు వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.అమరావతి రాజధాని పేరు వెనుక రామోజీరావు ఉన్నారని గుర్తు చేసుకుంటున్నారు.