Annadata Sukhibhav Scheme : ఏపీలో అన్నదాత సుఖీభవ పై క్లారిటీ వచ్చింది. ఏటా రైతులకు సాగు ప్రోత్సాహం కింద 20 వేల రూపాయలు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆ పథకం అమలుకు సన్నాహాలు ప్రారంభించింది కూటమి సర్కార్. మొన్నటి బడ్జెట్లో 4500 కోట్ల రూపాయలు కేటాయించింది. తాజాగా శాసనమండలిలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెనాయుడు కీలక ప్రకటన చేశారు. త్వరలో అన్నదాత సుఖీభవ కింద సాయం అందిస్తామని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధి కింద ఇచ్చే 6000 తో రాష్ట్ర ప్రభుత్వం మరో 14000 కలుపుకొని 20000 అందిస్తామని వివరించారు. దీంతో ఈ పథకం పై ఫుల్ క్లారిటీ వచ్చింది. 2019 ఎన్నికల్లో జగన్ నవరత్నాల్లో భాగంగా హామీ ఇచ్చారు. ప్రతి సంవత్సరం రైతులకు 15 వేల రూపాయల నగదు అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే కేంద్రం ఇచ్చే 6000 రూపాయలను కలుపుకొని.. 7500 జత చేసి.. రైతు భరోసా కింద 13,500 రూపాయలు అందించేవారు. ఈ తరుణంలో చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం రైతుకు 20 వేల రూపాయల నగదు అందిస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ పథకం అమలుకు సన్నాహాలు ప్రారంభించారు.
* బడ్జెట్లో 4500 కోట్లు కేటాయింపు
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చారు. దానికి సంబంధించి అర్హులు ఎంతమంది ఉన్నారో గుర్తించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకానికి 41.4 లక్షల మంది రైతులు అర్హులుగా అధికారులు గుర్తించారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీంతో బడ్జెట్లో 4500 కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభవ పథకం కోసం కేటాయించారు. ఇది నాలుగు నెలల బడ్జెట్ మాత్రమే. దీంతో సంక్రాంతి లోగా ఈ పథకం అమలుకు అవకాశం ఉంది. అదే విషయాన్ని చెప్పుకొచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి. పథకానికి సంబంధించి ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించామన్నారు.
* నిధుల సమీకరణతో
అయితే కూటమి జూన్లో అధికారం చేపట్టింది. ఆ సమయంలోనే ఖరీఫ్ ప్రారంభం అయ్యింది. దీంతో అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభించాలన్న డిమాండ్ వచ్చింది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం పథకం పై ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతో పథకం అమలు చేస్తారా? లేదా? అన్న అనుమానాలు వెంటాడాయి. ఈ తరుణంలోనే కూటమి సర్కార్ మాత్రం సీరియస్ గా దృష్టి పెట్టింది. ముందుగా నిధుల సమీకరణ పై ఫోకస్ చేసింది. అది కొలిక్కి వచ్చాక ఇప్పుడు పథకం అమలు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. సంక్రాంతి నాటికి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఒకవైపు ధాన్యం కొనుగోళ్లు, మరోవైపు అన్నదాత సుఖీభవ నగదు అందించడంతో రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలని భావిస్తోంది.