Hyderabad : హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొండాపూర్ డివిజన్ సిద్ధిక్‌నగర్‌లోని ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా ఓ పక్కకు ఒరిగిపోయింది. ఈ ఘటన మంగళవారం (నవంబర్ 19) రాత్రి చోటుచేసుకుంది. అది గమనించిన స్థానికులు.. వెంటనే భవనంలోని వ్యక్తులను అప్రమత్తం చేయడంతో.. అందులోని నివాసితులు.. భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. చుట్టుపక్కల స్థానికులు కూడా భయంతో ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనాస్థలికి చేరుకుని ఓ పక్కకు ఒరిగిన భవనాన్ని పరిశీలించారు. ఈ ఒరిగిన భవనం పక్కనే మరో నిర్మాణం చేపడుతున్నట్లు తెలుస్తోంది. పెద్ద గుంతలు తవ్వడంతో ఈ భవనం పక్కకు వంగిపోయినట్లు తెలుస్తోంది.
ఐదంతస్తుల భవనం ప్రమాదకరంగా ఒరిగిపోవడంతో.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా భవనంలో నివాసముంటున్న వారిని.. అలాగే భవనం చుట్టుపక్కల నివసించే వారిని కూడా అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.. సమాచారం అందుకున్న జీహెచ్‌ఎంసీ సిబ్బంది కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ముందస్తు చర్యలు చేపట్టారు. హైడ్రా కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో హైడ్రాలిక్ మిషన్‌తో అధికారులు కూల్చివేయనున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. కాగా, ఐటీ కారిడార్‌కు కేరాఫ్‌గా ఉన్న గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలు తరచూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కొండాపూర్ డివిజన్ సిద్ధిక్‌నగర్‌లో ఓ నిర్మాణదారుడు కనీస ప్రమాణాలు పాటించకుండా బహుళ అంతస్తుల నిర్మాణం పుట్టింగుల కోసం తీసిన గుంతల కారణంగా పక్కనే ఉన్న భవనాలను ప్రమాదంలో పడిపోయాయి.
ఐదంతస్తుల భవనం పక్కకు ఒరిగిపోయిందన్న వార్త క్షణాల్లో నగరమంతా వ్యాపించడంతో సమీపంలోని స్థానికులు సంఘటనా స్థలానికి వెళ్లి భవనాన్ని సందర్శిస్తున్నారు. ఒరిగిన భవనాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే, అసలు భవనం ఎందుకు పక్కకు ఒరిగింది? పక్కనే నిర్మాణం కోసం గుంతలు తవ్వడం వల్లే ఈ ప్రమాదం నిజంగా జరిగిందా? లేక నాణ్యతా ప్రమాణాలు లేకుండా ఐదంతస్తుల భవనాన్ని నిర్మించినందుకే ఇలా జరిగిందా? లేక తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ అంతస్తులు నిర్మించడం వల్ల జరిగిందా? లేక సరైన పునాది, స్తంభాలు వేయకపోవడం లాంటివి ఏమైనా జరిగిందా, లేక అక్కడ భూమి ఏదైనా కుంగిపోయిందా? అధికారులు తేల్చాల్సి ఉంది. దీనిపై నెటిజన్లు, స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ చర్చలు జరుపుతున్నారు.
కొండాపూర్ డివిజన్ సిద్దిక్ నగర్ రోడ్ నంబర్ 1లో 200 గజాల ప్లాట్ లో ఓ బిల్డర్ భారీ బహుళ అంతస్తుల నిర్మాణ పనులు చేపట్టారు. గత వారం రోజులుగా పుట్టీల నిర్మాణం కోసం గుంతలు తవ్వి పిల్లర్ల నిర్మాణం చేపడుతున్నాడు. ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా, కనీస అడ్డంకులు లేకుండా గుంతలు తవ్వడంతో పక్కనే ఉన్న ప్లాట్ నెంబర్ 1639లోని లక్ష్మణ్ అనే వ్యక్తికి చెందిన నాలుగంతస్తుల భవనం పిల్లర్లు బయటకు వచ్చి ఓ పక్కకు ఒరిగిపోయినట్లు తెలుస్తోంది.