Chandrababu Focus on Rayalaseema: రాయలసీమపై( Rayalaseema ) ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. మొన్నటి ఎన్నికల్లో రాయలసీమలో కూటమి సక్సెస్ అయ్యింది. వచ్చే ఎన్నికల వరకు దానిని నిలుపుకోవాలని చూస్తోంది కూటమి. అందుకే ప్రతి కార్యక్రమం ఇకనుంచి రాయలసీమ నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. టిడిపి తో పాటు జనసేన, బిజెపి సైతం రాయలసీమ పైనే ఫోకస్ పెట్టాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాయి. తద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అస్థిరపరిచి.. ఓటు బ్యాంకు ను మూడు పార్టీలు పొంది.. కూటమి ద్వారా లబ్ధి పొందాలన్నది ప్లాన్ గా తెలుస్తోంది. అందుకే ఈరోజు ‘సూపర్ సిక్స్- సూపర్ హిట్’ సభను అనంతపురంలో ఏర్పాటు ఏర్పాటు చేసినట్లు స్పష్టమవుతోంది. రాయలసీమలో 52 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అటువంటి చోట మొన్నటి ఎన్నికల్లో 45 స్థానాలను సాధించింది కూటమి. టిడిపికి 41, బిజెపికి నాలుగు, జనసేనకు ఒక స్థానం వచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం ఏడు స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. వచ్చే ఎన్నికల్లో కూడా ఆ 45 సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పుంజుకోనివ్వకుండా గట్టి వ్యూహంతో ముందుకు వెళ్తోంది కూటమి. వరుస కార్యక్రమాలతో పక్కా స్కెచ్ వేసుకుంటూ ముందుకు సాగుతోంది.
ప్రతిష్టాత్మకంగా మహానాడు..
తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) ప్రతిష్టాత్మకంగా కడపలో మహానాడు నిర్వహించింది. టిడిపి ఆవిర్భావం తర్వాత కడపలో మహానాడు ఎప్పుడు ఏర్పాటు చేయలేదు. అటువంటిది కూటమి గెలుపుతో ఊపు మీద ఉన్న టిడిపి మొన్న వేసవిలో మహానాడు నిర్వహించి సత్తా చాటింది. తరువాత పట్టుబట్టి మరి జగన్ సొంత అసెంబ్లీ నియోజకవర్గంలోని పులివెందుల, తరువాత ఒంటిమిట్ట జడ్పిటిసి సీట్లలో గెలిచి చూపించింది. ఇక పవన్ సైతం వరుసగా రాయలసీమలోనే టూర్లు ప్లాన్ చేస్తున్నారు. చివరికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైన మాధవ్ సైతం ప్రతి కార్యక్రమం రాయలసీమ నుండే మొదలు పెడుతున్నారు. వైసిపి ఓటు బ్యాంకు పై గురి పెట్టారని స్పష్టమవుతోంది.
బహుముఖ వ్యూహంతో..
సీఎం చంద్రబాబు( CM Chandrababu ) బహు వ్యూహంతో ముందుకు సాగుతున్నారు రాయలసీమ విషయంలో. ఒకవైపు పార్టీ పరంగా కార్యక్రమాలు చేపడుతూనే.. ప్రభుత్వపరంగా సీమలో ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు చేపట్టాలని చూస్తున్నారు. నామినేటెడ్ పదవుల్లో సైతం రాయలసీమకు 30 శాతం కేటాయించారు. హింద్రీ నీవా ద్వారా కుప్పంకు నీళ్లు తెప్పించారు. కడపలో ఉక్కు ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. రాయలసీమలో ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణ పనులను వేగవంతం చేశారు. అమరావతి రాజధాని తో పాటు పోలవరం ను పూర్తిచేసే పనిలో పడ్డారు. అన్నింటికీ మించి రాయలసీమలో అభివృద్ధి జాడలు చూపించాలని చూస్తున్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కృత నిశ్చయంతో ఉన్నారు. ఇలా పార్టీలతోపాటు ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ అనేది రాయలసీమ నుంచి ప్రారంభిస్తున్నారు ఆ మూడు పార్టీల నేతలు. ఈరోజు మూడు లక్షల ప్రజలతో సభ నిర్వహించి రాయలసీమ తమదే నన్న సంకేతాలు పంపించనున్నారు. చూడాలి దీనిని వైసీపీ ఎలా అధిగమిస్తుందో.