https://oktelugu.com/

CM Chandrababu: అన్నా క్యాంటీన్ల పై చంద్రబాబు మాస్టర్ ప్లాన్ సక్సెస్.. ఇంకా నిధుల కొరత లేదు

రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను తెరిపించింది కూటమి ప్రభుత్వం. వాటిని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా విరాళాలు సేకరించడానికి వినూత్న ప్రయత్నానికి దిగడం విశేషం.

Written By:
  • Dharma
  • , Updated On : October 28, 2024 / 11:06 AM IST

    CM Chandrababu(7)

    Follow us on

    CM Chandrababu: పేదవాడికి పట్టెడన్నం కోసం కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 200 వరకు క్యాంటీన్లను తెరిచింది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం అందిస్తోంది. కేవలం 15 రూపాయలకే ఆపన్నుల కడుపు నింపుతోంది. దేశంలోనే ఈ పథకం ఆదర్శంగా నిలిచింది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలానికి విస్తరించాలని భావించింది. కానీ ఇంతలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు మూతపడ్డాయి. ప్రత్యామ్నాయం కల్పిస్తామన్న వైసీపీ సర్కార్ క్యాంటీన్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈ ఎన్నికల్లో కూటమి గెలవడంతో అన్న క్యాంటీన్లను తిరిగి తెరిపించేందుకు చంద్రబాబు నిర్ణయించారు. తొలి విడతగా 100 క్యాంటీన్లను తెరిచారు. అదనంగా మరో 100 క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. క్యాంటీన్ల ద్వారా ఆహారం అందించే బాధ్యతను అక్షయపాత్ర ఫౌండేషన్ కు అప్పగించారు. ప్రస్తుతం ఈ క్యాంటీన్లు సేవలందిస్తున్నాయి. పెద్ద ఎత్తున విరాళాలు వస్తున్నాయి. అయితే అన్న క్యాంటీన్ల సేవలను మరింత విస్తృతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. విరాళాలు ఇచ్చే వారికి ఆదాయపు పన్ను మినహాయింపు ఇస్తామని ప్రకటించింది. దీంతో చాలామంది బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు భారీగా విరాళాలు ఇస్తారని అంచనా వేస్తోంది. తద్వారా ఐదేళ్లపాటు నిరాటంకంగా అన్న క్యాంటీన్లను నడిపించేందుకు వ్యూహరచన చేసింది చంద్రబాబు సర్కార్.

    * చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు
    వచ్చే నెలలో అన్న క్యాంటీన్ పేరుతో ప్రభుత్వం చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించింది. దీనికికేంద్ర ఆదాయపు పన్ను శాఖ, కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల విభాగాలు అనుమతి ఇచ్చాయి. విరాళాలు ఇచ్చే వారికి ఆదాయపు పన్ను చెల్లింపులు మినహాయింపు ఉంటుంది. కార్పొరేట్ కంపెనీలు, సామాన్యుల నుంచి విరాళాల సేకరణకు ప్రత్యేకంగా వెబ్సైట్ సైతం అందుబాటులోకి రానుంది. 100 క్యాంటీన్లలో మూడు పూటలకు కలిపి రూ.26.25 లక్షలు ఇచ్చేవారికి రోజంతా వారి పేరుతో ఆహారం అందించనున్నారు.

    * నిధుల కొరత అధిగమించేందుకు
    వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను నిర్వహించేందుకు నిధుల కొరత అనేది ఎదురుకానుంది. ఈ తరుణంలోనే చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారు. విరాళాలు అందించే వారి సంఖ్యపెరగాలని భావించారు. ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుండడంతో చాలామంది ముందుకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలు భారీగా విరాళాలు ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే వచ్చే విరాళాలను అనుసరించి మరికొన్ని క్యాంటీన్లను తెరిచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2029 ఎన్నికల వరకు విజయవంతంగా అన్న క్యాంటీన్లు నడిపేందుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నాల్లోనే ఉంది.