Chandhrababu Delhi Tour: ఢిల్లీలో చంద్రబాబు పెద్దఎత్తున లాబీయింగ్.. ఈసారి ఏజెండా ఏమిటంటే?

ప్రతి రెండు వారాలకు ఒకసారి చంద్రబాబు ఢిల్లీ బాట పడుతున్నారు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. అమరావతి రాజధాని తో పాటు పోలవరం ప్రాజెక్టు గురించి సమగ్రంగా వివరిస్తున్నారు. నిధుల సమీకరణకు బాగానే కృషి చేస్తున్నారు.

Written By: Dharma, Updated On : August 17, 2024 6:18 pm

Chandhrababu Delhi Tour

Follow us on

Chandhrababu Delhi Tour: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ లో బిజీ బిజీగా ఉన్నారు. వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశం అవుతున్నారు. ఏపీకి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక వరుసగా ఢిల్లీ వెళ్తున్నారు చంద్రబాబు.అమరావతి రాజధానితో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు నిధుల సమీకరణ ధ్యేయంగా చంద్రబాబు ఢిల్లీ టూర్ సాగుతోంది. ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 15000 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించింది. ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు రూపంలో కేటాయింపులు జరిపినట్లు తెలుస్తోంది. అందుకే ప్రపంచ బ్యాంకు బృందం ఇటీవల అమరావతిని సందర్శించింది.కీలక చర్చలు జరిపింది. త్వరలో ఆ నిధులు మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇటువంటి తరుణంలో సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. నిన్న సాయంత్రం ప్రత్యేక విమానంలో చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. అక్కడ పార్టీ ఎంపీలు సాదరంగా ఆహ్వానం పలికారు. శనివారం రోజంతా చంద్రబాబు బిజీగా గడిపారు.సాయంత్రం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. అటు తరువాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, హోం మంత్రి అమిత్ షాలతో కూడా భేటీ అవుతారు. నిన్న పొద్దుబోయాక జల శక్తి మంత్రి సి ఆర్ పాటిల్ తో సమావేశం అయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పై చర్చించారు. ప్రస్తుతం నిర్మాణ బాధ్యతలు చూస్తున్న సమస్త కే పనులు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చారు.

* గతానికి భిన్నంగా
గతానికి భిన్నంగా చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. తన వెంట పార్టీ ఎంపీలతో పాటు జనసేన ఎంపీలను చంద్రబాబు తీసుకెళ్తున్నారు. ఎన్డీఏ ఎంపీలతో చంద్రబాబు ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు.వారికి దిశా నిర్దేశం చేశారు.ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నందున.. వీలైనంతవరకు విభజన హామీల పరిష్కారం కోసం ఎంపీలు కృషి చేయాలని సూచించారు.రాజకీయం కంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడాలని కోరారు.

* ఏడు విమానాశ్రయాల ఏర్పాటు
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఏడు విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం కృత నిశ్చయంతో ఉందని ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఇప్పటికే భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మాణం శరవేగంగా జరుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. దాదాపు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పౌర విమానయాన సేవలు పెంచాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. చంద్రబాబుతో భేటీ తర్వాత ఈ విషయాలను వెల్లడించారు.

* రేపు సాయంత్రం వరకు
చంద్రబాబు రేపు సాయంత్రం వరకు ఢిల్లీలో ఉండనున్నారు. ఈ రాత్రికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో చర్చలు జరపనున్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయల సాయం ప్రకటించిన నేపథ్యంలో.. ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు వీలైనంతవరకు విడుదలయ్యేలా చూడాలని కోరే అవకాశం ఉంది. మరోవైపు కేంద్ర హోం శాఖ మంత్రి తో రాజకీయపరమైన అంశాలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కీలక చర్చలు జరిపే అవకాశం ఉంది.