CM Chandrababu: సంక్షేమ పథకాల( welfare schemes) విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. పథకాలను వరుసగా అమలు చేస్తామని ప్రకటించారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో స్వయంగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల అమలు విషయంలో స్పష్టత ఇచ్చారు. మూడు పథకాలను అమలు చేసి తీరుతామని చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించి అమలు చేసే సమయాన్ని సైతం ప్రకటించారు. ఎన్నికల్లో చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పింఛన్ మొత్తాన్ని పెంచి మూడు నెలల బకాయితో అందించగలిగారు. ప్రతినెలా పింఛన్లు అందిస్తున్నారు. మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే కీలకమైన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా విషయంలో లబ్ధిదారులకు ఎదురుచూపు తప్పడం లేదు. అయితే నిన్ననే ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. ఈ మూడు పథకాలకు సంబంధించి నిధులను కేటాయించారు. ఈరోజు ఏకంగా సీఎం చంద్రబాబు ప్రకటించేసరికి లబ్ధిదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
Also Read: ఏపీలో ఎండల ఎఫెక్ట్.. మారిన ఒంటిపూట బడుల షెడ్యూల్!
* ప్రధానంగా అన్నదాత సుఖీభవ( Annadata Sukhi Bhava ) విషయంలో లక్షలాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో రైతు భరోసా పేరిట సాయం అందించేవారు. ఏడాదికి కేంద్రం అందించే సాయంతో కలిపి రూ.13,500 అందించేవారు. అయితే తాము అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు 20వేల రూపాయలు అందిస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇప్పుడు బడ్జెట్లో నిధులు కేటాయించడమే కాదు.. మేలో అందిస్తామని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు.
* విద్యా సంవత్సరం ప్రారంభం జూన్లో తల్లికి వందనం( thalliki Vandanam ) పేరిట విద్యార్థుల చదువుకు సాయం అందిస్తామని ప్రకటించారు చంద్రబాబు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పేరిట ఇంట్లో ఒక విద్యార్థికి 15000 రూపాయల చొప్పున అందించారు జగన్మోహన్ రెడ్డి. అయితే తొలి ఏడాది సంపూర్ణంగా ఇచ్చినా.. అటు తరువాత ఆ మొత్తాన్ని తగ్గిస్తూ వచ్చారు. అయితే తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి 15000 రూపాయల చొప్పున అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా దీనిపై ప్రకటన చేశారు చంద్రబాబు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వర్తింప చేస్తామని ప్రకటించారు.
* మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే సాయాన్ని రెట్టింపు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ పదివేల రూపాయల చొప్పున అందించేవారు. అయితే వచ్చేనెల 14 నుంచి వేట నిషేధ సమయం ప్రారంభం అవుతుండడంతో.. ప్రతి మత్స్యకారుడుకి 20వేల రూపాయల చొప్పున అందిస్తామని తాజాగా ప్రకటించారు చంద్రబాబు. మొత్తానికి అయితే కీలక సంక్షేమ పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అయింది.
Also Read: ఏపీలో చిరుద్యోగులకు శుభవార్త.. పదవీ విరమణ వయసు పెంపు!