Chandrababu : చాలామంది నాయకులు రాజకీయంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటారు. చేజేతుల కొన్ని నిర్ణయాలతో రాజకీయ భవిష్యత్తును పాడు చేసుకుంటారు. అటువంటి వారిలో మాజీ ఎంపీ కేశినేని నాని( kesineni Nani ) ఒకరు. ఈ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికలకు ముందే ఆ పార్టీలో చేరి విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. తమ్ముడు కేశినేని శివనాథ్ (చిన్ని) చేతిలో ఓడిపోయారు. టిడిపి తరఫున రెండుసార్లు విజయవాడ ఎంపీగా గెలిచారు నాని. పార్టీకి విధేయుడుగా కూడా పేరు తెచ్చుకున్నారు. కానీ సొంత పార్టీలో ప్రత్యర్థులు పెరిగిపోవడం, వారికి హై కమాండ్ నుంచి మద్దతు లభించడంతో చేసేదిలేక పార్టీ మారాల్సి వచ్చింది. రాజకీయాలకు దూరం కావాల్సి వచ్చింది. అయితే తాజాగా ఆయన వైఖరి చూస్తుంటే తిరిగి టిడిపిలోకి ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం సాగుతోంది.
Also Read : దళిత యువకుడికి చంద్రబాబు షాక్.. అలా చేశారేంటి?
* ఆసక్తికర పోస్ట్..
ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu) జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి. జాతీయ ప్రముఖులు సైతం శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ఒకప్పటి టిడిపి నేత కేసినేని నాని సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. చంద్రబాబుకు వజ్రోత్సవ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో చంద్రబాబుతో తనకు ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. అయితే ఇంతవరకు పర్వాలేదు కానీ.. ఇటీవల నాని టిడిపిలోకి ఎంట్రీ ఇస్తారని తెగ ప్రచారం నడుస్తోంది. ఇటువంటి సమయంలోనే చంద్రబాబుతో తనకున్న అనుబంధాన్ని నాని గుర్తు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రజా జీవితంలో సుదీర్ఘ ప్రయాణాన్ని, దశాబ్దాల రాజకీయ నాయకత్వం, పాలన, ప్రజా సేవను సూచిస్తుందని నాని తెలిపారు. చంద్రబాబుతో పనిచేసే అవకాశం తనకు లభించిందని నాని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నాని పోస్టు తెగ వైరల్ అవుతోంది.
* పార్టీలో ప్రత్యర్థులతో ఇబ్బంది..
వాస్తవానికి నానికి పార్టీ అధినేత చంద్రబాబుతో ఎటువంటి ఇబ్బంది లేదు. ఆయనతో మంచి సంబంధాలు ఉంటూ వచ్చాయి. అయితే విజయవాడలో ( Vijayawada)తన రాజకీయ ప్రత్యర్థులతో పాటు సోదరుడు చిన్నిని లోకేష్ ప్రోత్సహిస్తున్నారన్నది కేశినేని నాని లో ఉన్న అనుమానం. ఈ భావనతోనే లోకేష్ పాదయాత్రకు సైతం అప్పట్లో డుమ్మా కొట్టారు నాని. తన ప్రత్యర్థులుగా భావిస్తున్న నేతలకు పార్టీలో ప్రాధాన్యత పెరగడాన్ని నాని జీర్ణించుకోలేకపోయారు. అయితే రోజురోజుకు నాని విషయంలో వివాదాలు ముదురుతుండడంతో చంద్రబాబు సైతం ఆయనను పక్కన పెట్టారు. ప్రత్యామ్నాయంగా ఆయన సోదరుడు చిన్నిని తెరపైకి తెచ్చారు. దానిని జీర్ణించుకోలేకపోయిన కేశినేని నాని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడంతో మనస్థాపానికి గురయ్యారు. అందుకే రాజకీయాలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు ప్రకటించారు.
* కేవలం స్వయంకృతాపరాధం
అయితే కేశినేని నాని వ్యవహార శైలి ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. గత కొద్దిరోజులుగా ఆయన సోషల్ మీడియాలో( social media) చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఎక్కడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. టిడిపి పై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం లేదు. అయితే ఇటీవల మాత్రం ఆయన అడుగులు టిడిపి వైపు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచారు నాని. ఎన్నికల్లో సైతం ఆయనకే టిడిపి టికెట్ లభించేది. ముచ్చటగా మూడోసారి గెలిచేవారు. కేంద్రంలో కూడా ప్రాధాన్యత దక్కేది. కానీ చేజేతులా ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు అందుకే టిడిపిలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరి టిడిపి హై కమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read : రాజు గారి పెద్దరికం వైపు చంద్రబాబు మొగ్గు.. ఆ సీనియర్ కు నో ఛాన్స్!