CM Chandrababu : తెలుగుదేశం( Telugu Desam) పార్టీలో లోకేష్ స్లోగన్ బలపడుతూనే ఉంది. లోకేష్ ను ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఒక అడుగు ముందుకేసి ఓ మంత్రి అయితే రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అంటూ కామెంట్స్ చేశారు. అదే వేదికపై సీఎం చంద్రబాబు కూడా ఉన్నారు. దీంతో ఒక్కసారిగా చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. అక్కడ సీన్ మారిపోయింది. ప్రపంచ పెట్టుబడుల సదస్సు దావోస్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు తో కూడిన బృందం నిన్ననే అక్కడకు వెళ్ళింది. ఆ బృందంలో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ తదితరులు ఉన్నారు. అక్కడ ప్రవాస ఆంధ్రులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ మంత్రి భరత్ మాట్లాడుతూ పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం గా నిలుస్తుంది అని చెప్పారు. చంద్రబాబు రక్షణగా ఉంటారని.. దశాబ్ద కాలం ప్రభుత్వం ఉంటుందని తేల్చి చెప్పారు. అందుకే ఏపీలో పరిశ్రమలు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.
* లోకేష్ ను ఆకాశానికి ఎత్తేసిన భరత్
మంత్రి నారా లోకేష్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు భరత్( TG Bharat ). లోకేష్ దార్శనికుడైన నాయకుడని అభివర్ణించారు. పైగా విద్యాధికుడిగా చెప్పారు. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నాయకుడిగా అభివర్ణించారు. ఎవరు అవునన్నా కాదన్నా.. ఎవరు ఒప్పుకున్నా కాకపోయినా.. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత నారా లోకేష్ కు ఉందంటూ తేల్చి చెప్పారు. దీంతో అదే వేదికపై ఉన్న చంద్రబాబు ఒక్కసారిగా అసహనం వ్యక్తం చేశారు. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదా అంటూ మంత్రి భరత్ ను మందలించారు. అటువంటి వ్యాఖ్యలు చేయాల్సిన వేదిక ఇదా అంటూ ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం మారిపోయింది.
* డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్
ఇటీవల రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా( deputy CM) లోకేష్ ఎంపిక చేయాలి అన్న డిమాండ్ తెర పైకి వచ్చిన సంగతి తెలిసిందే. టిడిపి అనుకూల మీడియాతో పాటు లోకేష్ బృందం నేతల నుంచి ఈ డిమాండ్ వినిపించింది. అయితే కూటమి ప్రభుత్వం నడుస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న ఈ చర్చ ఎటు దారితీస్తుందో నన్న ఆందోళన అంతటా కనిపించింది. మరోవైపు కూటమిలో విభేదాలు తప్పవని వైసిపి భావిస్తోంది. లోకేష్ ను డిప్యూటీ సీఎం గా చేస్తే జన సైనికుల నుంచి అభ్యంతరాలు వస్తాయని.. అదే సమయంలో టిడిపి సైతం ముందుగా ముందుకెళ్లే అవకాశం ఉందని అంచనా వేసింది వైసిపి. అందుకు తగ్గట్టుగానే పరిస్థితులు ఉండడంతో టిడిపి తో పాటు జనసేనలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. అందుకే ఈ అంశంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
* అనుకూల మీడియాలో
టిడిపి అనుకూల మీడియా గా ముద్రపడిన ఆంధ్రజ్యోతిలో( Andhra Jyothi) లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాల్సిన సమయం ఇదేనంటూ కథనం వచ్చింది. తరువాత మహాసేన రాజేష్ ఇదే డిమాండ్ చేశారు. బుద్ధ వెంకన్న సైతం లోకేష్ డిప్యూటీ సీఎం చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. మరోవైపు పార్టీలో సీనియర్ నేతగా ముద్రపడిన కాల్వ శ్రీనివాసులు సైతం ఏకంగా నిండు సభలో చంద్రబాబు సమక్షంలో ఈ డిమాండ్ చేశారు. అయితే ఇప్పుడు ఏకంగా టీజీ భరత్ ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అంటూ చెప్పడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా సీఎం చంద్రబాబు దీనిపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇకనుంచి ఇటువంటి ప్రకటనలు చేయడం మానుకోవాలని టిడిపి హై కమాండ్ పార్టీ శ్రేణులకు సూచించినట్లు సమాచారం. మొత్తానికి అయితే లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్.. ముఖ్యమంత్రి చేయాలన్న మరో డిమాండ్ వద్ద ఆగిపోయింది. చూడాలి మరి ఏం జరుగుతుందో.