Chandrababu: గంటా శ్రీనివాసరావు పార్టీ మారతారా? పొమ్మనలేక పొగ పెడుతున్నారా? ఆయనకు ఈసారి టిక్కెట్ ఇవ్వడం లేదా? వైసిపికి ఆయన టచ్లోకి వెళ్లారా? గత రెండు రోజులుగా ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. టిడిపి, జనసేన తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో గంటా శ్రీనివాసరావుకు చోటు దక్కలేదు. ఆయన ఈసారి భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ ఆ సీటును జనసేనకు కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గంటా పేరును విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ స్థానానికి పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ విషయాన్ని గంటా కూడా ప్రస్తావించారు. తాను అక్కడ నుంచి పోటీ చేయనని కూడా తేల్చి చెప్పారు.
వాస్తవానికి ప్రతి ఎన్నికలో నియోజకవర్గాన్ని మార్చుతూ గంటా విజయాన్ని అందుకుంటూ వచ్చారు. గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. వైసీపీ అధికారంలోకి రావడంతో సైలెంట్ అయ్యారు. ఎన్నికలకు ఏడాది ముందు యాక్టివ్ అయ్యారు. దీంతో గంటా శ్రీనివాసరావు పై ఒక రకమైన ముద్ర ఉంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదన్న ఆగ్రహం పార్టీ శ్రేణుల్లో ఉంది. అయితే సీనియర్ కావడం, బలమైన సామాజిక వర్గ నేత కావడంతో గంటా విషయంలో టిడిపి నాయకత్వం సర్దుకుంటూ ముందుకు సాగుతోంది. కానీ ఇప్పుడు టిక్కెట్ విషయానికి వచ్చేటప్పుడు నాయకత్వం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటుంది. చీపురుపల్లి వెళ్లి పోటీ చేయాలని సూచించింది. కానీ అందుకు గంటా విముఖత చూపుతున్నారు.
గంటా విషయంలో వివిధ రాజకీయ సమీకరణలు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. అయ్యన్నపాత్రుడుతో గంటాకు విభేదాలు ఉన్నాయి. అయ్యన్నపాత్రుడు దూకుడుగా ఉంటారు. పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. ఈసారి ఎన్నికల్లో తన కుమారుడికి అనకాపల్లి పార్లమెంట్ స్థానాన్ని అడిగారు. కానీ పొత్తులో భాగంగా జనసేనకు సీటు కేటాయించడంతో చంద్రబాబు సీటు ఇవ్వలేకపోయారు. అయ్యన్నపాత్రుడు ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ప్రత్యర్థి గంట శ్రీనివాసరావు కోరిన భీమిలి సీటు ఇస్తే అయ్యన్న మనస్థాపానికి గురయ్యే అవకాశం ఉంది. మరోవైపు గంటా శ్రీనివాసరావు అంటే పవన్ కళ్యాణ్ సైతం వ్యతిరేక భావన ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంలో గంటా శ్రీనివాసరావు ది కీలక పాత్ర. నాడు చిరంజీవిని అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఎదగాలన్న కోణంలో గంటా శ్రీనివాసరావు పీఆర్పీని విలీనం చేయించారని పవన్ అనుమానించారు. అందుకే నాడు పిఆర్పి లో ఉండే గంటా శ్రీనివాసరావు, రామచంద్రయ్య వంటి నేతలను పవన్ వ్యతిరేకిస్తుంటారు. ఇప్పుడు గంటాకు సీటు కేటాయిస్తే పవన్ కు కోపం వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే చీపురుపల్లి కేటాయించి పొమ్మనలేక పొగ పెట్టారన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.
మరోవైపు గంటా శ్రీనివాసరావు వైసీపీకి టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో వైసీపీలో చేరదామనుకున్న గంటాను మంత్రి అవంతి శ్రీనివాస్ అడ్డుకున్నారు. అయితే ఇప్పుడు భీమిలి టిక్కెట్ కేటాయిస్తే పార్టీలో చేరేందుకు గంటా శ్రీనివాసరావు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎప్పటికీ అక్కడ అవంతి శ్రీనివాసరావు గట్టి అభ్యర్థిగా ఉన్నారు. అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి నాగబాబు పోటీ చేయడం ఖాయంగా తేలింది. దీంతో అక్కడ బలమైన అభ్యర్థి అవసరం. ఒకవేళ గంటా పార్టీలోకి వస్తే అనకాపల్లి ఎంపీ సీట్ ని ఇస్తామని వైసిపి ఆఫర్ చేసినట్లు సమాచారం. ఒకవేళ గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరితే మాత్రం.. ఎన్నికల ముంగిట భారీ చేరిక అవుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.