Amaravathi Capital : అమరావతి రాజధాని నిర్మాణం పై టిడిపి కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. కేంద్ర ప్రభుత్వం సైతం ఆసక్తి చూపడంతో.. వీలైనంత త్వరగా పనులు పరుగు పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డిసెంబర్ నుంచి అమరావతి రాజధాని నిర్మాణ పనులు పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కేంద్రం బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయలను కేటాయించింది. ప్రపంచ బ్యాంకు నిధులనుంచి సర్దుబాటు చేసింది. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సైతం పలుమార్లు అమరావతిని సందర్శించారు. నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తొలివిడతగా నవంబర్లో 3750 కోట్ల రూపాయల విడుదలకు ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ప్రధాని వద్ద ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ప్రపంచ బ్యాంకు నిధులు వీలైనంత త్వరగా అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ నుంచి అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారు. వీలైనంత త్వరగా అమరావతి రాజధానిని ఒక కొలిక్కి తేవాలని భావిస్తున్నారు.నిధుల కొరత లేకుండా ఉంటే.. అమరావతి రాజధాని నిర్మాణంలో జాప్యం అనే సమస్య రాదని అభిప్రాయపడుతున్నారు.
* కేంద్రం కీలక ప్రాజెక్టులు
ఒకవైపు అమరావతి రాజధాని నిర్మాణ పనులు జరుగుతూనే.. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రాజెక్టుల పనులు సైతం సమాంతరంగా జరగాలని చంద్రబాబు భావిస్తున్నారు. అమరావతి కి కేంద్రం రోడ్డు, రవాణా, రైలు మార్గాలకు సంబంధించి ప్రత్యేక ప్రాజెక్టులను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అన్ని జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు కనెక్టివిటీ పెంచేలా జాతీయ రహదారులు, రైల్వే లైన్లో ఏర్పాటుకు కేంద్రం ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఒకవేళ డిసెంబర్లో అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమైతే.. అందుకు సమాంతరంగా కేంద్ర ప్రాజెక్టుల పనులు కూడా ప్రారంభించాలని చంద్రబాబు భావిస్తున్నారు. చంద్రబాబు తాజాగా ఢిల్లీ పర్యటనలో సైతం ప్రధాని మోదీ తో పాటు మంత్రులను ఇదే అంశంపై విజ్ఞప్తులు చేస్తున్నారు.
* ఫలితాలు వచ్చిన వెంటనే కొత్త కళ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి కొత్త కళ వచ్చింది. ఫలితాలు వచ్చిన వెంటనే వందలాది యంత్రాలతో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. విద్యుత్ లైట్లను కూడా వెలిగించారు.అయితే మొత్తం 33,000 ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ పనుల నిమిత్తం 33 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. టెండర్ తగ్గించుకున్న ఓ సంస్థ అదే పనిపై ఉంది. ఇప్పటికే ఐఐటి నిపుణులు సైతం కీలక ప్రతిపాదనలు చేశారు. జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తయ్యాక అమరావతి యధాస్థితికి చేరుకుంటుంది. దీంతో డిసెంబర్లో పునర్నిర్మాణ పనులకు ముహూర్తం ఖరారు చేయనున్నారు. అది మొదలు వీలైనంత త్వరగా అమరావతికి ఒక రూపు తేవాలని భావిస్తున్నారు చంద్రబాబు.