Bharateeya Janatha Party : రెండు రాష్ట్రాల్లో బిజెపి అనూహ్య ఫలితాలు సాధించింది. హర్యానాలో మంచి విక్టరీ సాధించింది. జమ్మూ కాశ్మీర్లో సైతం తన ప్రభావాన్ని చాటుకుంది. హిందువులు అధికంగా ఉండే జమ్ములో బిజెపి ఘనవిజయం సాధించింది. కాశ్మీర్ విషయానికి వచ్చేసరికి మాత్రం పట్టు సాధించలేకపోయింది. మొత్తానికి అయితే సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన ఈ ఎన్నికలు బిజెపికి కొత్త ఉత్సాహం ఇచ్చాయి. ముఖ్యంగా హర్యానాలో కాంగ్రెస్ పార్టీ పాగా వేస్తుందని సర్వే సంస్థలు అంచనా వేశాయి. కానీ ఆ అంచనాలకు భిన్నంగా అధికారాన్ని మరోసారి అందుకుంది భారతీయ జనతా పార్టీ. దేశంలో ఇండియా కూటమి బలం పెరుగుతోందని విశ్లేషణలు వస్తున్న తరుణంలో బిజెపికి ఈ విజయం ఉపశమనమే. అయితే వచ్చే ఏడాది జరగనున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆ పార్టీకి అసలు సిసలు పరీక్ష. మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ రాష్ట్రాల్లో బిజెపి చాలా రకాలుగా రాజకీయాలు చేసింది. తమకున్న బలానికి మించి మిగతా రాజకీయ పార్టీలతో ఒక ఆట ఆడేసింది. అది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. దీంతో అక్కడ విజయం అనేది అంత ఈజీ కాదు. అందుకే ఆందోళన చెందుతోంది భారతీయ జనతా పార్టీ. ప్రతి రాష్ట్రం ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి కూడా. వాటిని అధిగమించి బిజెపి మంచి ఫలితాలు సాధించడం అంటే ఆశామాషి కాదు.
* బీహార్లో అయితే నితీష్ తరచూ కూటమిలను మార్చారు.ఆర్జెడితో జత కట్టిన ఆయన కొద్ది రోజులకే ఆ పార్టీ నుంచి దూరమయ్యారు.మళ్లీ బిజెపికి చేరువ అయ్యారు.అయితే మరోసారి బిజెపికి హ్యాండిచ్చి ఆర్జెడితో చేతులు కలిపారు. అది కూడా మూన్నాళ్ళ ముచ్చటగా ఉంది. ఇప్పుడు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపితో ఆయన కలిసి వెళ్తారా? లేదా? అన్నది ప్రశ్నార్ధకమే.
* ఢిల్లీలో బిజెపి అధికారం చేపట్టి చాలా రోజులు అవుతోంది. అమ్ ఆద్మీ పార్టీ వచ్చిన తర్వాత ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి రాలేదు. పైగా ఆప్ పంజాబ్లో సైతం పాగా వేసింది. సరిగ్గా ఎన్నికల ముంగిట ఢిల్లీ సీఎంగా ఉన్న కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది. అధికారంలోకి వచ్చే అవకాశాన్ని కోల్పోయింది. బిజెపి చేసిన తప్పిదానికి కేజ్రీవాల్ భారీ స్కెచ్ వేశారు. ఏకంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అదే పార్టీకి చెందిన వ్యక్తిని నియమించారు. ఆయనను ఆపే శక్తి బిజెపికి లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.* మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ఆడిన వైకుంఠపాళీ అక్కడ ప్రజలకు తెలియంది కాదు. అందుకే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు విలక్షణ తీర్పు ఇచ్చారు. శివసేన, ఎన్సీపీని టార్గెట్ చేసుకుని బిజెపి ఆడిన గేమ్ అక్కడ ప్రజలను సైతం నివ్వెరపరిచింది. అక్కడ అధికారంలోకి రావడం అంత ఈజీ కాదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.*జార్ఖండ్లో సైతం ప్రాంతీయ పార్టీలతో ఒక గేమ్ ఆడింది బిజెపి.కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడింది. దీంతో అక్కడి ప్రజలతో పాటు రాజకీయ పార్టీల్లో బిజెపి పై ఒక రకమైన భావం ఏర్పడింది. అక్కడ కూడా ఏమంత పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఈ నాలుగు రాష్ట్రాల్లో బిజెపి నెగ్గుకు రాకపోతే.. చరిత్ర మసకబారి పోయే ప్రమాదం ఉంది. సార్వత్రిక ఎన్నికల ముంగిట సీన్ మారనుంది.