Chandrababu Vs Jagan: చంద్రబాబు జగన్ ట్రాప్ లో పడ్డారా? మినీ మేనిఫెస్టో ప్రకటించి తప్పుచేశారా? తనకున్న ట్రాక్ రికార్డును పక్కకు నెట్టారా? అభివృద్ధి అనే నినాదాన్ని వదిలి సంక్షేమం బాట పట్టడం తప్పిదమేనా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో జగన్ ట్రాప్ లో పడిన చంద్రబాబు మూల్యం చెల్లించుకున్నారు. అధికారానికి దూరమయ్యారు. బీజేపీతో వైరం పెంచుకున్నారు. ఇప్పుడు మరోసారి జగన్ బాటలో నడిచి అదే మాదిరిగా ప్రమాదాన్ని మూటగట్టుకున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకో ఈ నిర్ణయం కరెక్టు కాదని మెజార్టీ ప్రజలు భావిస్తున్నారు.
ఒక్కో నాయకుడు ప్రజలకు ఒక్కోలా కనిపిస్తారు. చంద్రబాబు అంటేనే అభివృద్ధి, విజనరీ అని అంతా భావిస్తారు. కానీ సంక్షేమంలో మాత్రం ఆయనకు పేలవ రికార్డు. అటువంటిది చంద్రబాబు నోట సంక్షేమ పథకాలు అన్న ఉచ్ఛరణ వచ్చేసరికి కొద్దిపాటి ఆశ్చర్యమే వేస్తోంది. గతంలో సంక్షేమం కంటే అభివృద్ధే మిన్నగా భావించిన చంద్రబాబు తన పాలనలో దానికే ప్రాధాన్యమిచ్చారు. అభివృద్ధి అంటే చంద్రబాబు పేరు గుర్తుకురావాలన్నట్లుగా చంద్రబాబు పరితపించారు. కానీ ప్రజలు సంక్షేమానికి మార్కులు వేశారు. దీంతో ఈసారి తాను కూడా సంక్షేమ బాట పట్టకుంటే ఓటర్లు పట్టించుకోరని డిసైడయిన చంద్రబాబు జగన్ కంటే మించి అన్న రేంజ్ లో మినీ మేనిఫెస్టోను విడుదల చేసి చర్చకు కారణమయ్యారు.
అయితే అన్నివేళాలా పొలిటికల్ ట్రెండ్ ఒకలా ఉండదు. 2014లో అనుభవమున్న నాయకుడు అవసరమని ప్రజలు టీడీపీని ఆదరించారు. చంద్రబాబుకు జైకొట్టారు. 2019లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ఒక్కచాన్స్ తో పాటు సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టారు. జగన్ కు అంతులేని మెజార్టీని కట్టబెట్టారు. అయితే 2024లో ట్రెండ్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ చంద్రబాబు మాత్రం వైసీపీకి విరుగుడు మంత్రంగా సంక్షేమ బాట పట్టారు. కానీ వైసీపీట్రాప్ లో పడ్డారని.. చంద్రబాబు అభివృద్ధి నినాదంతో ఉంటే బాగుండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గత ఎన్నికల ముందు విభజన హామీల అమలులో టీడీపీ విఫలమైందని ఊరూ వాడా జగన్ ప్రచారం చేశారు. చంద్రబాబు ఎన్డీఏ నుంచి దూరం కావడానికి వ్యూహం పన్నారు. అవేవీ గుర్తించని చంద్రబాబు బీజేపీకి దూరమై అష్టకష్టాలు పడ్డారు. ఇప్పుడు సంక్షేమం విషయంలో తామే మెరుగు అని చెప్పుకునేందుకు ప్రకటించిన మినీ మ్యానిఫెస్టో కూడా ఆ విషయంలో జగన్ ను అనుసరించేందుకు ప్రయత్నిస్తున్నట్లే ఉంది. తద్వారా మరోసారి జగన్ ట్రాప్ లో పడి జనంలో పలుచన అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇటు సంక్షేమం, అటు అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళితే మాత్రం చంద్రబాబు ప్లాన్ వర్కవుట్ అయ్యే చాన్స్ ఉంది.