Pawan Kalyan: పవన్ వెంటే సినీ ఇండస్ట్రీ.. కారణం అదే

గత ఎన్నికల నాటికి తెలంగాణలో కేసీఆర్ సర్కార్ అధికారంలో ఉంది. ఆయన చంద్రబాబుకు బద్ధ వ్యతిరేకి. జగన్ కు అత్యంత సన్నిహితుడు. అంతకుముందు 2018 లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తో చంద్రబాబు జత కలిశారు.

Written By: Dharma, Updated On : April 12, 2024 10:42 am

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan:పవన్ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి. ఈ లెక్కన ఆయన వెనుక తెలుగు సినీ పరిశ్రమ ఉండాలి. ఏకపక్షంగా మద్దతు తెలపాలి. కానీ గత ఎన్నికల్లో సినీ పరిశ్రమ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా పవన్ వెంట నడవలేదు. పైగా అలీ, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, రచయిత చిన్ని కృష్ణ, పోసాని కృష్ణ మురళి వంటి వారితో మాట్లాడించడం ద్వారా పవన్ కళ్యాణ్ కు సినీ ఇండస్ట్రీ వ్యతిరేకమన్న భావన కల్పించడంలో వైసీపీ అధినేత జగన్ సక్సెస్ అయ్యారు.అయితే ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. వైసీపీ మద్దతుదారులుగా ఉన్న నటులు సైలెంట్ కాగా.. జనసేనకు బాహటంగానే కొందరు మద్దతు తెలుపుతున్నారు. దీంతో సినీ పరిశ్రమ యూటర్న్ తీసుకుందన్న ప్రచారం జరుగుతోంది.

గత ఎన్నికల నాటికి తెలంగాణలో కేసీఆర్ సర్కార్ అధికారంలో ఉంది. ఆయన చంద్రబాబుకు బద్ధ వ్యతిరేకి. జగన్ కు అత్యంత సన్నిహితుడు. అంతకుముందు 2018 లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తో చంద్రబాబు జత కలిశారు. అయినా సరే కెసిఆర్ అధికారంలోకి వచ్చారు. చంద్రబాబును దెబ్బతీయాలని భావించారు. అందుకు తెలంగాణలో ఉన్న ఏపీ సెటిలర్స్,తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులను వాడుకున్నారు. రకరకాలుగా భయపెట్టి వైసిపి కి మద్దతు తెలిపేలా చేశారు. అయితే ఈసారి అక్కడ రేవంత్ సర్కారు ఉంది. అదే సమయంలో ఏపీలో వైసీపీకి అనుకూల పరిస్థితులు లేవన్న టాక్ ఉంది. పైగా సినీ ప్రముఖులను వాడుకొని జగన్ వదిలేశారన్న అపవాదు కూడా ఉంది. అటు టికెట్ల వ్యవహారంలో సైతం వైసీపీ సర్కార్ సినీ పరిశ్రమను ఇబ్బంది పెట్టింది. ఇవన్నీ పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా మారుతున్నాయి. అందుకే చాలామంది బాహాటంగానే మద్దతు ప్రకటిస్తున్నారు.

గత ఎన్నికల్లో జగన్ కు అండగా మోహన్ బాబు నిలిచారు. ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో చంద్రబాబు సర్కార్ పై పెద్ద ఉద్యమమే చేశారు. కానీ గత ఐదేళ్లుగా మోహన్ బాబును జగన్ పట్టించుకోలేదు. అందుకే ఈ ఎన్నికల్లో ఆయన సైలెంట్ అయ్యారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి ఏకంగా జనసేనలోకి వెళ్లారు. ఆ పార్టీ స్టార్ క్యాంపైనర్ గా మారి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అలీ కూడా పెద్దగా ఆసక్తిగా లేరు. ఒక్క పోసాని కృష్ణ మురళి మాత్రం అడపాదడపా బయటకు వస్తున్నారు. ప్రెస్ మీట్ లు పెట్టి వెళ్తున్నారు. అంతకుమించి సినీ పరిశ్రమ నుంచి వైసీపీకి పెద్దగా ఆదరణ లేదు. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు కూడా వైసిపి పై ఏమంత సుముఖంగా లేరు.

తాజాగా యువ నటుడు నవదీప్ జనసేనకు మద్దతు తెలిపారు. సినీ ప్రమోషన్ లో భాగంగా పిఠాపురం వెళ్లిన నవదీప్ అవసరమైతే పవన్ తరఫున ప్రచారం చేయడానికి సిద్ధమేనని ప్రకటించారు. ఒక్క నవదీప్ కాదు. వర్ధమాన నటులు హైపర్ ఆది, అనసూయ, జానీ మాస్టర్, గెటప్ శీను, కోన వెంకట్, స్టార్ ప్రొడ్యూసర్ బి వి ఎస్ ఎన్ ప్రసాద్,.. ఇలా ఒక్కరేమిటి చాలామంది జనసేనకు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే వీరు జనసేనకు మద్దతు తెలపడానికి ప్రధాన కారణం వైసీపీ అధికారంలోకి రాదన్న కోణంలోనే. అందుకే బాహటంగా మద్దతు తెలపగలుగుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అన్నింటికీ మించి చిరంజీవి ఐదు కోట్ల రూపాయల విరాళం ప్రకటించడం పెద్ద విషయం. ప్రస్తుతం ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి ఉన్నారు. జనసేనకు కుటుంబం మద్దతు లేదన్న ప్రచారానికి చెక్ చెబుతూ.. చిరంజీవి స్పష్టమైన సంకేతాలు పంపగలిగారు. తద్వారా పవన్ కు సినీ ఇండస్ట్రీ అండగా ఉందన్న విషయాన్ని గుర్తు చేయగలిగారు. అటు చిరంజీవికి వ్యతిరేక వర్గంగా ఉన్న మోహన్ బాబు సైతం వ్యూహాత్మకంగా సైలెంట్ కావడంతో.. సినీ పరిశ్రమ ఏకపక్షంగా పవన్ కు మద్దతు తెలుపుతోందని ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. ఇది వైసీపీకి కలవరపాటుకు గురిచేస్తోంది.