Chandrababu Delhi Tour: కడపలో( Kadapa) మహానాడు జరుగుతోంది. చివరి రోజు ఈ సాయంత్రం తో కార్యక్రమం ముగియనుంది. రెండు రోజులుగా సక్సెస్ అయిన ఈ వేడుక.. మూడో రోజు కూడా ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతోంది. మరోవైపు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎన్నికయ్యారు. మరో రెండేళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కంటే.. ఆ పార్టీ బాధ్యతలను ఎక్కువ రోజులు చూసుకున్నారు చంద్రబాబు. 1995 నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు. అయితే ఇటీవలే ఢిల్లీ వచ్చిన చంద్రబాబు.. మహానాడు ముగిసిన వెంటనే మరోసారి హస్తినకు బయలుదేరుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొన్నటికి మొన్న మూడు రోజులపాటు ఢిల్లీలో చంద్రబాబు పర్యటించిన సంగతి తెలిసిందే. అటు నుంచి నేరుగా కుప్పం వచ్చారు. నూతన గృహప్రవేశంలో పాల్గొన్నారు. అక్కడ నుంచి కడప మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు. ఈరోజు మహానాడు ముగియనుండగా.. రేపు ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. దీంతో చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
* సిఐఐ సదస్సుకు..
ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu) ఢిల్లీ పర్యటన ఖరారు అయింది. శుక్రవారం మధ్యాహ్నం ఆయన ఢిల్లీ వెళ్ళనున్నారు. భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వెళుతున్నారు. శుక్రవారం సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల వరకు ఢిల్లీ హోటల్ తాజ్ ప్యాలెస్ లో జరిగే ఈ సదస్సులో పాల్గొంటారు. రాత్రికి ఢిల్లీలోనే బస్సు చేస్తారు. 31న ఏపీకి తిరిగి వస్తారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను కలిసి అవకాశం ఉంది. అయితే పది రోజుల వ్యవధిలో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి. మొన్ననే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యారు చంద్రబాబు. అంతకంటే రెండు రోజుల ముందే ఢిల్లీకి చేరుకున్న ఆయన హోం మంత్రి అమిత్ షా తో భోజనం చేశారు. కీలక చర్చలు జరిపారు. అటు తరువాత రోజు ఏకంగా ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. చివరి రోజు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్నారు.
* ప్రధానిని ఆహ్వానించేందుకు..
అయితే ఈసారి ఢిల్లీ పర్యటనకు( Delhi tour ) సంబంధించి కీలక అంశం ఒకటి ఉంది. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొనున్నారు. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ విచ్చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మరోసారి తాను విశాఖ వస్తున్నానని మోదీ ప్రకటించారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఖరారు అయ్యింది. ఇప్పుడు ప్రధానిని ఆహ్వానించేందుకు సీఎం చంద్రబాబు ఢిల్లీ ప్రత్యేకంగా వెళుతున్నట్లు తెలుస్తోంది. యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా కేంద్రం నిర్వహిస్తోంది. ఈ తరుణంలో విశాఖలో జరిగే యోగా దినోత్సవానికి ప్రధాని మోదీ హాజరవుతానని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం సైతం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తుంది. విశాఖలోని ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు ఐదు లక్షల మందితో ప్రత్యేక ఈవెంట్ నిర్వహణకు ఏర్పాటు చేస్తోంది.
* పది రోజులుగా బిజీబిజీగా..
మరోవైపు గత పది రోజులుగా బిజీగా గడుపుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీ పర్యటన ముగించుకుని ఈ నెల 31న ఏపీకి తిరిగి రానున్నారు. అదే రోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ( Dr BR Ambedkar konasima) జిల్లాలో పర్యటిస్తారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీతో పాటుగా బంగారు కుటుంబం కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టూ ఉన్నారు. కాట్రేనికోన మండలం చేయ్యేరులో దాతల సహకారంతో పి4 కార్యక్రమం మొదలవ్వనుంది. ఆ పనులను సైతం చంద్రబాబు పరిశీలిస్తారు. మొత్తానికైతే వారం రోజుల వ్యవధిలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన రెండోసారి సాగనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.