Andhra Pradesh Government : ఏపీలో కూటమి ప్రభుత్వం పాలనను మరింత సరళతరం చేయాలని భావిస్తోంది. ప్రజలకు క్షణాల్లోనే పౌర సేవలు అందించాలని నిర్ణయం తీసుకుంది. ప్రజలకు అవసరమైన సేవలను సత్వరమే అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా మెటాతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని నవంబర్ 30 నుంచి అమల్లోకి తీసుకురానుంది. దీని ప్రకారం తొలి విడతగా 100 పౌర సేవలు వాట్సాప్ లోనే అందుబాటులోకి రానున్నాయి. రేషన్ కార్డులు, జనన మరణ ధ్రువీకరణ పత్రాలు, రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్స్, కరెంట్, ఆస్తి పన్ను బిల్లుల చెల్లింపు ఇలా సేవలు ఉండనున్నాయి. ప్రస్తుతం ఆఫ్ లైన్ తో పాటు ఆన్ లైన్ లో పౌర సేవలు అందిస్తున్నారు. వీటి కోసం వివిధ వెబ్ సైట్లు, యాప్ లను వాడాల్సి వస్తోంది. ఆఫ్ లైన్ అంటే కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. దీంతో సమయంతో పాటు డబ్బులు కూడా వృధా అయ్యాయి. అందుకే వాటిని నియంత్రించేందుకు వాట్సాప్ లో ఒక్క క్లిక్ తో 100 సేవలు ప్రస్తుతం అందుబాటులోకి రాబోతున్నాయి. బిల్లుల చెల్లింపులతో పాటు ఆలయాల దర్శన టికెట్ల వరకు.. ప్రతి సేవ వాట్సాప్ లోనే పొందవచ్చు. ప్రజలకు ఈ విధానంతో ఎంతో మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వీలైనంత త్వరగా దీనిని పూర్తిస్థాయిలో అమలు చేయాలని చూస్తోంది.
* నాటి వలంటీర్ సేవలను గుర్తు చేస్తూ
వైసిపి ప్రభుత్వం పౌర సేవల కోసం వాలంటీర్ వ్యవస్థను తెచ్చిన సంగతి తెలిసిందే. ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్ను నియమించారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు పౌర సేవల బాధ్యతలను అప్పగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ వాలంటీర్ వ్యవస్థ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ తరుణంలో వాలంటీర్ ద్వారా అందించే సేవలను.. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అందించాలని కూటమి ప్రభుత్వం భావించింది. అందుకే వాట్సాప్ సేవలను అందుబాటులోకి తేనుంది.
* సకల సమాచారం
అయితే కేవలం పౌర సేవలే కాదు.. వివిధ కీలక అంశాలకు సంబంధించిన సమాచారం కూడా వాట్సాప్ ద్వారా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు ప్రత్యేక కోర్సులు, అలాగే ప్రాజెక్టులు, మార్కెట్ ధరలు, వాతావరణం, ఉన్నత విద్యలో పరీక్షల సమాచారం, యూనివర్సిటీ సర్టిఫికెట్లు, కోర్సులు, పరిశ్రమల శాఖ అనుమతుల సమాచారం సైతం వాట్సాప్ లో అందుబాటులోకి తీసుకురానుంది కూటమి ప్రభుత్వం. ఒక్క క్లిక్ తో వందలాది సేవలు కళ్ళ ముందుకు రానున్నాయి.