Chandrababu: ఆ ఒక్క ట్విట్ తో అనుమానాలను పటాపంచలు చేసిన చంద్రబాబు

నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా ఘన నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు మనమంతా కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. దీనిపై చంద్రబాబు కూడా స్పందించారు.

Written By: Dharma, Updated On : May 30, 2024 11:20 am

Chandrababu

Follow us on

Chandrababu: చంద్రబాబు విదేశాల నుంచి వచ్చారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన విదేశాలకు వెళ్లారు. ఎక్కడికి వెళ్లారు అన్నది స్పష్టత ఇవ్వలేదు. కానీ వైద్య పరీక్షల నిమిత్తం ఆయన విదేశాలకు వెళ్లినట్లు టిడిపి శ్రేణులు చెబుతున్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత నేరుగా చంద్రబాబు మీడియా ఎదుట మాట్లాడలేదు. పార్టీ గెలుపు పై స్పష్టత ఇవ్వలేదు. జగన్ మాత్రం ఐప్యాక్ కార్యాలయంలో మరోసారి గెలుస్తామని మాత్రమే ప్రకటించారు. గత ఎన్నికల కంటే అధికంగా సీట్లు వస్తాయని చెప్పుకొచ్చారు. అయితే చంద్రబాబు నుంచి ఈ తరహా ప్రకటన రాకపోవడాన్ని వైసీపీ నేతలు ఎత్తిచూపారు. ఓటమి భయంతోనే చంద్రబాబు విదేశాలకు వెళ్లిపోయారని ప్రచారం చేశారు. టిడిపి శ్రేణుల్లో ఇది గందరగోళానికి కారణమైంది. అయితే విదేశాల నుంచి ఏపీకి వచ్చిన చంద్రబాబు పార్టీ శ్రేణులతో సమావేశం అయ్యారు. టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. గెలుపు పై స్పష్టతనిచ్చారు.ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన ట్విట్ ఒకటి టిడిపి శ్రేణులను ఆకట్టుకుంది.

నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా ఘన నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు మనమంతా కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. దీనిపై చంద్రబాబు కూడా స్పందించారు. రీ ట్విట్ చేశారు. నిజంగా ఎన్టీఆర్ వెండితెరపై, తెర వెనుక లెజెండ్. ప్రజా కేంద్రక పాలన, సంక్షేమం కోసం పోరాడేందుకు ప్రేరణగా నిలుస్తారు. ఆయన నిస్వార్థ ప్రజా సేవ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన ఆశయ సాధన కోసం అందరం కలిసి పని చేద్దాం మోడీ గారు.. అంటూ చంద్రబాబు ట్విట్టర్ వేదికగా కీలక సందేశం ఇచ్చారు.

అయితే ఈ ఒక్క ట్విట్ ఇప్పటివరకు టిడిపి పై జరిగిన ప్రచారానికి చెక్ చెప్పారు చంద్రబాబు. ప్రధానిగా మోదీ, ఏపీ సీఎం గా చంద్రబాబు అన్నది స్పష్టమైంది. ఎన్నికల ప్రచారంలో సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు ప్రధాని మోదీ. ఇప్పటికే కేంద్రంతో పాటు చంద్రబాబుకు సర్వే నివేదికలు అందాయని.. అందుకే ఒక అంచనాకు వచ్చి వరుసగా కీలక ప్రకటనలు చేస్తున్న విషయాన్ని టిడిపి కూటమి నేతలు ప్రస్తావిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ పాలనకు సంబంధించి చంద్రబాబు సైతం చూపిస్తున్న చొరవ కూడా చర్చకు దారితీస్తోంది. విశాఖ నుంచి కాంబోడియాకు మానవ అక్రమ రవాణా జరుగుతోందని.. దానిని నియంత్రించాలని చంద్రబాబు డిజిపి కి లేఖ రాశారు. రోడ్డు ప్రమాదాల మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. కౌంటింగ్ ఏర్పాట్లకి సంబంధించి డిజిపి తో పాటు ఎలక్షన్ కమిషన్కు లేఖలు రాశారు. ఇలా ఈ చర్యలన్నీ స్పష్టమైన సమాచారంతోనే చేస్తున్నారని.. టిడిపి కూటమి తప్పకుండా గెలుస్తుందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాయి.