Vallabhaneni Vamsi: ఏపీలో గన్నవరం నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అక్కడ నుంచి వల్లభనేని వంశీ మోహన్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడమే అందుకు కారణం. ఈ నియోజకవర్గంలో నుంచి పుచ్చలపల్లి సుందరయ్య ప్రాతినిధ్యం వహించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తరువాత రెండు సార్లు గెలిచింది వంశీ మోహన్. ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొడతానని గట్టిగా డిసైడ్ అయ్యారు. అయితే అది అంత సులువు కాదని తేలుతోంది. పోలింగ్ సరళి బట్టి ఇక్కడ టిడిపికి ఏడ్జ్ కనిపిస్తుందన్న సంకేతాలు వచ్చాయి. అందుకే వల్లభనేని వంశి అమెరికా వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది. ఆయన ఎప్పుడు వస్తారో కూడా స్పష్టంగా తెలియడం లేదు. వంశి అమెరికాలోనే ఉండిపోతారని టిడిపి మాత్రం ప్రచారం చేస్తోంది.
గత ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసి వంశి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో తొలిసారిగా టికెట్ దక్కించుకున్నారు. టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. గత ఎన్నికల్లో రెండోసారి గెలిచిన తర్వాత వైసీపీలోకి ఫిరాయించారు. చంద్రబాబుతో పాటు లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేయడంలో వంశి ముందుండేవారు. ఒకానొక దశలో చంద్రబాబు కుటుంబం పై వంశీ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి.అందుకే ఈసారి వల్లభనేని వంశీని ఓడించాలని.. వైసీపీలో ఉన్న యార్లగడ్డ వెంకట్రావును టిడిపిలోకి రప్పించారు చంద్రబాబు. బలమైన అభ్యర్థి కావడంతో ఆయనకు టికెట్ ఇచ్చారు. ఎన్నికల్లో వంశీ, యార్లగడ్డ వెంకట్రావుల మధ్య గట్టి ఫైట్ నడిచింది. ఎవరు గెలిచినా తక్కువ ఓట్లతో అని స్పష్టమవుతోంది.
గన్నవరం నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం అధికం. ఆ వర్గం సంపూర్ణంగా టిడిపికి సహకరిస్తోంది. చంద్రబాబు కుటుంబం పై వంశీ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆ సామాజిక వర్గమంతా దూరమైంది. ఒక్కమాటలో చెప్పాలంటే వల్లభనేని వంశీ ఏకాకి అయ్యారు. తాను నమ్ముకున్న నియోజకవర్గ ప్రజలు తనను నమ్మలేదని.. సొంతవారు సైతం వెన్నుపోటు పొడిచారు అంటూ వల్లభనేని వంశీ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అందుకే ఆయన విదేశాలకు వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అందరూ నియోజకవర్గాలకు చేరుకొని కౌంటింగ్ సరళి పై సమీక్షిస్తుంటే.. వల్లభనేని వంశీ మోహన్ మాత్రం అమెరికా విడిచిపెట్టి రాలేదు. దీంతో టిడిపి ప్రచారం చేస్తున్నట్టు ఆయన ఆరు నెలల పాటు ఉండిపోతారా? అన్న అనుమానాలు అయితే ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.