https://oktelugu.com/

Vangaveeti Radhakrishna: వంగవీటి రాధాకు చంద్రబాబు బంపర్ ఆఫర్..అదేనా?

1988లో వంగవీటి మోహన్ రంగ హత్యకు గురయ్యారు. 1989 ఎన్నికల్లో ఆయన భార్య రత్నకుమారి విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ 1994 తర్వాత ఆ కుటుంబం రాజకీయంగా తెర మరుగైంది.

Written By: , Updated On : May 8, 2024 / 01:39 PM IST
Vangaveeti Radhakrishna

Vangaveeti Radhakrishna

Follow us on

Vangaveeti Radhakrishna: ఒక్కోసారి రాజకీయంగా తప్పుడు నిర్ణయాలు అధికారాన్ని దూరం చేస్తాయి. అవకాశాలను తొక్కి పెడతాయి. ఈ కోవలోకి చెందుతారు వంగవీటి రాధాకృష్ణ. దివంగత వంగవీటి మోహన్ రంగ కుమారుడిగా రాజకీయాల్లో ప్రవేశించారు రాధాకృష్ణ. కానీ తన రాజకీయ జీవితంలో కీలక నిర్ణయాల సమయంలో తప్పటడుగులు వేశారు. దానికి మూల్యం చెల్లించుకున్నారు. తరచూ పార్టీలు మారుతారన్న అపవాదును మూటగట్టుకున్నారు. అందుకే ఈసారి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తేరాధాకు కీలక పదవి తప్పదన్న సంకేతాలు చంద్రబాబు ఇచ్చారు.

1988లో వంగవీటి మోహన్ రంగ హత్యకు గురయ్యారు. 1989 ఎన్నికల్లో ఆయన భార్య రత్నకుమారి విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ 1994 తర్వాత ఆ కుటుంబం రాజకీయంగా తెర మరుగైంది. కానీ 2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి రాధాను ప్రోత్సహించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ ఇచ్చి గెలిపించారు. 26 ఏళ్ల వయసులోనే రాధాకు అరుదైన గౌరవం లభించింది. కానీ 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు రాధా. నియోజకవర్గాల పునర్విభజన తో ఏర్పడిన విజయవాడ సెంట్రల్ కు మారారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో ఓడిపోయారు. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. మరోసారి తూర్పు నియోజకవర్గం నుంచి పోటీచేసి టిడిపి అభ్యర్థి గద్దె రామ్మోహన్ చేతిలో ఓడిపోయారు. 2019ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గం కోసం పట్టుపట్టారు. దక్కకపోయేసరికి టిడిపిలో చేరారు. టిడిపికి స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం చేశారు. పార్టీ ఓటమి చవిచూసేసరికి గత ఐదేళ్లుగా సైలెంట్ అయ్యారు.

ఈ ఎన్నికల్లో కూడా రాధాకు టిడిపి సీటు సర్దుబాటు చేయలేదు. దీంతో రాధా వైసీపీలో చేరతారని ఒకసారి, జనసేనలో చేరతారని మరోసారి ప్రచారం జరిగింది. కానీ రాధా నిబ్బరంగానే ఉన్నారు. ప్రస్తుతం టిడిపి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. కొద్ది రోజుల కిందట దెందులూరు లో చింతమనేని ప్రభాకర్ తరఫున ప్రచారం చేశారు. ఆ సమయంలోనే చంద్రబాబు రాధాకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. రాధాకు మంచి భవిష్యత్తు ఇస్తానని కూడా తేల్చి చెప్పారు. ప్రస్తుతం రాధ విజయవాడ పార్లమెంట్ స్థానం పరిధిలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. విజయవాడ తూర్పు, పశ్చిమ అభ్యర్థులకు మద్దతుగా ఇటీవల ప్రచారం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం.. రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని.. క్యాబినెట్లో సైతం తీసుకుంటారని సన్నిహితులు చెబుతున్నారు. అయితే గతానికి భిన్నంగా రాధా.. నిబ్బరంగా ఒకే పార్టీలో ఉండడం విశేషం.