Chandrababu
Chandrababu: చంద్రబాబు సమయస్ఫూర్తి గల నేత. ఎంత సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఆత్మస్థైర్యాన్ని కోల్పోరు. చివరి వరకు పోరాడుతారు. పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ఇష్టపడతారు. తెలుగుదేశం పార్టీ కిందకు పడిన ప్రతిసారి.. నెమ్మదిగా లేపి విజయం వైపు అడుగులు వేశారు. అందుకే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు చంద్రబాబుపై అపార నమ్మకం. ఎన్టీఆర్ ఉంటే ఇంతవరకు టిడిపి నడిచి ఉండేది కాదన్నది కొందరి వ్యక్తిగత అభిప్రాయం. చంద్రబాబు వల్లే ఎన్ని సంక్షోభాలు ఎదురైనా తెలుగుదేశం పార్టీ కొనసాగిందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా తన చతురతను చంద్రబాబు ప్రదర్శించగలిగారు.
దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ హవా నడుస్తోంది. తమకు బలమున్నచోట నేరుగా.. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నచోట వాటితో కలిసి బిజెపి పోటీ చేస్తోంది. బీహార్, ఒడిస్సా వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంది. అయితే అక్కడ పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లు పొందింది. బీహార్ లో నితీష్ కుమార్ పార్టీ నుంచి… ఒడిస్సాలో నవీన్ పట్నాయక్ పార్టీ నుంచి ఎక్కువ సీట్లు దక్కించుకోవడంలో బిజెపి సక్సెస్ అయ్యింది. కానీ ఏపీ విషయానికి వచ్చేసరికి మాత్రం ఆ పరిస్థితి లేదు. మొత్తం వ్యవస్థను చంద్రబాబు తన కంట్రోల్ లో పెట్టుకున్నారు. బిజెపికి కేవలం పది అసెంబ్లీ సీట్లు, ఆరు పార్లమెంట్ స్థానాలు మాత్రమే ఇచ్చారు. అక్కడే చంద్రబాబు అనుకున్నది సాధించగలిగారు.
బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. కానీ అంతకుముందే ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన జనసేన ను తన వైపు తిప్పుకున్నారు. బిజెపితో సీట్ల సర్దుబాటు ప్రక్రియ జరగకుండానే.. టిడిపి తొలి జాబితాలో ఏకంగా 94 మంది అభ్యర్థులను ప్రకటించారు. జనసేనతో సైతం ఐదుగురు అభ్యర్థులతో తొలి జాబితాను వెల్లడించారు. రెండో జాబితాను సైతం ప్రకటించారు. దీంతో బీజేపీపై ఒత్తిడి పెంచారు. అటు బిజెపి సైతం తక్కువ స్థానాలకే పరిమితం కావడం వెనుక చంద్రబాబు వ్యూహం ఉంది. పైగా బిజెపికి కేటాయించిన అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో ఎక్కువగా.. గతంలో తెలుగుదేశం గెలవలేనివే. రాయలసీమలో బిజెపికి ప్రకటించిన పార్లమెంటు స్థానాలు సైతం గతంలో టిడిపి గెలవనివే. బిజెపికి పొత్తులో భాగంగా తక్కువ స్థానాలు ఇచ్చారు. ఆపై టిడిపి బలహీనంగా ఉన్న స్థానాలనే కట్టబెట్టారు. దీంతో చంద్రబాబుపై టిడిపి శ్రేణులకు అపారమైన నమ్మకం మరింత రెట్టింపు అయ్యింది.