Kamineni Srinivas
Kamineni Srinivas: మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఎన్నికల్లో మరోసారి బరిలో నిలవనున్నారు. గత ఏడాదిగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. బిజెపి, టిడిపి, జనసేన.. మూడు పార్టీల శ్రేణులను తన వెంట నడుచుకునేలా చూసుకున్నారు. మూడు పార్టీల మధ్య పొత్తు కుదురుతుందని ఎప్పుడో అంచనా వేశారు.అందుకు తగ్గట్టుగా చక్కటి ప్రణాళిక వేసుకున్నారు. ఇప్పుడు కైకలూరు నియోజకవర్గంలో ఎటువంటి పోటీ లేకుండా కామినేని మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థి కానున్నారు. మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావాలని భావిస్తున్నారు.
రాష్ట్ర బిజెపిలో అనుబంధ విభాగాలకు అందుబాటులో ఉండే ఏకైక నాయకుడు కామినేని శ్రీనివాస్. బిజెపి శ్రేణులకు సంబంధించి విద్య, వైద్య అవసరాలను తీర్చే ఒకే ఒక నాయకుడు ఆయన. కార్యకర్తల ఏ చిన్న అవసరానికైనా.. చాలా వేగంగా స్పందిస్తారని ఆ పార్టీలోనే ఒక రకమైన ప్రచారం ఉంది. అందుకే పార్టీ అనుబంధ విభాగాలు కామినేని శ్రీనివాస్ అంటే ఎనలేని అభిమానం చూపుతాయి. అందుకే కామినేని శ్రీనివాస్ పోటీ చేయబోయే కైకలూరు నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేవు. తెలుగుదేశంతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జనసేన అధినేత పవన్ తో సైతం సఖ్యతగా మెలుగుతారు. ఏడాది కిందటి నుంచి తానే కైకలూరు నుంచి పోటీ చేస్తానని కామినేని చెప్పుకుంటూ వచ్చారు. అందుకే అక్కడ టిడిపి ఇన్చార్జ్ జయ మంగళం వెంకటరమణ వైసీపీలోకి వెళ్లిపోయారు.
వాస్తవానికి 2014 ఎన్నికల్లో కామినేని శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. పవన్ సైతం చంద్రబాబుకు సిఫారసు చేశారు. కైకలూరు స్థానాన్ని కేటాయించాలని కోరారు. అయితే చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించి కామినేనిని బిజెపిలో చేర్పించారు. పొత్తులో భాగంగా కైకలూరు స్థానాన్ని బిజెపికి కేటాయించారు. బిజెపి అభ్యర్థిగా కామినేని పోటీ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో పొత్తులో భాగంగా కామినేనిని చంద్రబాబు తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు. కామినేని సైతం తెలుగుదేశం పార్టీతో కలిసి పోయారు. గత ఐదేళ్లుగా బిజెపిలోనే కొనసాగుతూ వచ్చారు. బిజెపి అనుబంధ సంఘాల ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. అదే టిక్కెట్టు సునాయాసం గా రావడానికి కారణమైంది. అటు తెలుగుదేశంతో పాటు జనసేన నుంచి సైతం సంపూర్ణ సహకారం అందుతోంది. మొత్తానికైతే కైకలూరు నుంచి కామినేని పోటీ చేయడం ఖాయంగా తేలుతోంది.