Volunteers: ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛన్ల పంపిణీ జరిగింది. వాలంటీర్లు లేకుండా పింఛన్లు పంపిణీ చేయవచ్చని కూటమి ప్రభుత్వం నిరూపించింది. ఈ తరుణంలో వాలంటీర్లను కొనసాగిస్తారా? కొత్తవారిని నియమిస్తారా? అన్న విషయంలో సస్పెన్షన్ సాగుతోంది. అయితే ప్రభుత్వ తీరు చూస్తుంటే మరోలా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులతో పింఛన్లు పంపిణీ చేయవచ్చని నిరూపించింది ప్రభుత్వం. ఒక విధంగా చెప్పాలంటే వాలంటీర్ల అవసరం లేదని చెప్పేందుకే ఈ ప్రయత్నం చేసింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏప్రిల్, మేలో సచివాలయ ఉద్యోగులతో పింఛన్లు పంపిణీ చేయాలని తమ కోరామని.. కానీ జగన్ సర్కార్ అలా చేయలేదన్నారు. దానిని నిరూపించేందుకే తాము సచివాలయ ఉద్యోగులతో పింఛన్లు ఇప్పించామని గుర్తు చేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం వలంటీర్ల వ్యవస్థ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కాకినాడ జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో తొలి బహిరంగ సభను ఏర్పాటు చేశారు. స్థానికులతో మనసు గుత్తి మాట్లాడారు. ఎన్నికల ఫలితాల తర్వాత తాను ఊరేగింపులు చేయాలనుకోలేదని.. ఇప్పుడు పింఛన్లు ఇచ్చి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నట్లు పవన్ తెలిపారు. ప్రస్తుతం తాను పాలనా విధానాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తనను భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించిన పిఠాపురం ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
వాలంటీర్లు లేకుండా పింఛన్లు అందించడం సాధ్యం కాదని వైసీపీ ప్రభుత్వం చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు పవన్. కూటమి అధికారంలోకి వస్తే పెన్షన్లు రద్దు అవుతాయని కూడా బెదిరించిన వైనాన్ని గుర్తు చేశారు. అందుకే పింఛన్ మొత్తాన్ని పెంచి.. సచివాలయ ఉద్యోగుల ద్వారా అందించగలిగామని.. నాలుగు రోజుల్లో చేయాల్సిన పని ఒక రోజులో చేసి చూపించామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి నిధుల కొరత తీవ్రంగా ఉందని.. తనకు వచ్చిన జీతాన్ని సైతం విడిచి పెడుతున్నానని.. క్యాంప్ ఆఫీసునకు సొంతంగా ఫర్నిచర్ ఏర్పాటు చేసుకున్నట్లు కూడా పవన్ ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులతో పనిచేయించుకోవడం మన విధి అని కూడా చెప్పుకొచ్చారు. ఒకవైపు నిధుల కొరత, మరోవైపు దుబారా ఖర్చును నియంత్రించడం, ఇంకోవైపు ప్రభుత్వ ఉద్యోగులతో పనిచేయించుకోవాలని పవన్ చెప్పడం చూస్తుంటే.. వాలంటీర్ల అవసరం లేదని భావిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో వాలంటీర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపిస్తామని కూడా పవన్ చెప్పుకొచ్చారు.