Chandrababu and Daggubati : చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్టోరీ ని ఒకసారి పరిశీలిస్తే.. మన చుట్టూ ఉన్న అంశం లాగే ఉంది. అడుగు స్థలం కోసం అన్నదమ్ములు ఇద్దరు కోర్టులకు ఎక్కుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు అధికారం కోసం.. తెలుగుదేశం పార్టీ మీద పెత్తనం కోసం పోటీపడ్డారు. కారాలు, మిరియాలు నూరారు. పరస్పరం విమర్శలు చేసుకున్నారు. తోడల్లుళ్లు అనే మాట మర్చిపోయి పరస్పరం శత్రువులలాగా మారిపోయారు. ఎవరికివారు కోటరీలు ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో చంద్రబాబు పై చేయి సాధించగా.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనదైన రోజు కోసం ఎదురుచూడడం మొదలుపెట్టారు. ఇలా కాలం గడిచిపోయింది. ఒకప్పుడున్న ఉడుకు రక్తం చల్లబడింది. కోపాలు తగ్గిపోయాయి. తాపాలు కాలగర్భంలో కలిసిపోయాయి. మనుషులు ఎదురెదురుగా కలిసినప్పుడు.. చిరునవ్వులు చిందాయి. అదిగో అప్పుడు మానవత్వం ఇద్దరి మధ్య పరిమళించింది. అంతే అప్పటిదాకా ఉన్న వైరం కాస్త ప్రేమగా మారింది. బంధం బలోపేతం అయింది. బంధుత్వం చిక్కబడింది.
Also Read : నాగబాబు, పిఠాపురం వర్మ ఓకే.. మిగతా ఆ నలుగురు ఎవరు?
కుటుంబాలు దూరమవుతున్నాయి
ఎప్పుడో ఎక్కడో వచ్చిన మాట తేడాతో కుటుంబాలకు కుటుంబాల దూరం అవుతున్నాయి. డబ్బుల కోసం బంధువుల్ని, తోబుట్టువుల్ని దూరం చేసుకుంటున్నారు చాలామంది. ఇక రాజకీయ పార్టీల కార్యకర్తల పరిస్థితి మరింత దారుణంగా ఉంటున్నది. నమ్మిన నాయకుల కోసం సొంతింటి వారినే పక్కన పెడుతున్న దుస్థితి కనిపిస్తున్నది. పార్టీ ఎజెండాలు, జెండాలు సొంత అన్నదమ్ముల మధ్య అడ్డుగోడలుగా రూపాంతరం చెందుతున్నాయి. ఒక ఇంటి మీద ఒక పార్టీ జెండా కట్టామంటే.. కన్నుమూసే వరకు దానినే పట్టుకోవాలనే సూత్రాన్ని కామన్ కార్యకర్తలు పాటిస్తున్నారు. నిత్యం సమీకరణాల లెక్కలతో.. గెలుపు, ఓటముల తేడాలతో జెండాలను, అజెండాలను నాయకులు మార్చేస్తున్నారు.. ఇలా చెబుతుంటే.. దీనిని చదువుతుంటే కొంతమందికి ఇబ్బందిగా ఉండవచ్చు గాని.. కఠిన వాస్తవం మాత్రం ఇదే. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు ఎపిసోడ్లో చివరగా చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే.. మనకు మన కుటుంబం కంటే ఏదీ ఎక్కువ కాదు. మరేదీ గొప్ప కాదు.. ఏదో ఒక జెండాలో పడిపోకూడదు. ఒకరి అజెండాలో చిక్కుకుపోకూడదు. ఇలాంటి సంఘటనలు పై వాటిని గుర్తు చేస్తుంటాయి. స్థూలంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే మహానుభావులు ఏది చేసినా బాగానే ఉంటుంది. అది లోక కళ్యాణం కోసం పాటుపడుతూనే ఉంటుంది.
నాటి సంక్షోభంలో..
1984లో టిడిపిలో ఏర్పడిన సంక్షోభం అతిపెద్దది. నాదెండ్ల భాస్కరరావు పార్టీని చీల్చారు. సీనియర్ ఎన్టీఆర్ ను పదవి నుంచి కిందికి దించారు. అప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిశారు. టిడిపిని ఒడ్డుకు తీసుకొచ్చారు. అలాంటి సమయంలో 1995లో టిడిపిలో మరోసారి సంక్షోభం ఏర్పడింది. అప్పుడు చంద్రబాబు, దగ్గుబాటి సంయుక్తంగా ఉన్నారు. అయితే నాడు ఎన్టీఆర్ ను అనవసరంగా దించారు అనే ఆరోపణను ఎదుర్కొన్నారు. ఇక సీన్ కట్ చేస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. దగ్గుబాటి మాత్రం అలానే ఉండిపోయారు. ఇక ఆ సమయంలో ఆయన తన రాజకీయ ప్రయాణాన్ని భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వైసీపీలలో సాగించారు. చివరికి తట్టుకోలేక రాజకీయ విరామాన్ని ప్రకటించారు. చంద్రబాబుతో సయోధ్య కుదుర్చుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు. రాజకీయాలు వద్దని.. కుటుంబ బంధాల మధ్య రాజకీయాలు వద్దని భావించారు.. అందువల్లే ఆయన రచించిన పుస్తకావిష్కరణకు చంద్రబాబును పిలిచారు. అదే వేదిక వద్ద తన మనోగతాన్ని వెల్లడించారు. గతం గతః.. ఇద్దరం ఒకటిగా ఉంటామని ఆ ప్రకటించారు. బాబు చేస్తున్న అభివృద్ధికి తన సహకారం ఉంటుందని పేర్కొన్నారు. ఈ మాటలు విన్న చంద్రబాబు పైకి లేచి వచ్చారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరు నేతలు ఇలా కలిసిపోవడం అక్కడివారికి ఆనందాన్ని అందించింది.
Also Read : పవన్ ను తిడితే ఎలా.. నష్టమని తెలిసినా ఎందుకలా జగన్!