CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు దూకుడు మీద ఉన్నారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమంపై ఫోకస్ పెట్టారు. నామినేటెడ్ పదవులను సైతం ప్రకటించారు. ఇప్పటివరకు రెండు జాబితాలను వెల్లడించారు. మరోవైపు అసెంబ్లీ తో పాటు మండలిలో చీఫ్ విప్, విప్ పదవులను తాజాగా ప్రకటించారు. ఏపీ అసెంబ్లీలో చీఫ్ విప్ గా జీవి ఆంజనేయులు, శాసన మండల లో చీఫ్ విప్ గా పంచుమర్తి అనురాధ వ్యవహరించనున్నారు. అసెంబ్లీలో టిడిపి నుంచి 11 మందిని, జనసేన నుంచి ముగ్గురిని, బిజెపి నుంచి ఒకరిని విప్ లుగా ఎంపిక చేశారు. మండలిలో టిడిపి నుంచి ముగ్గురు, జనసేన నుంచి ఒకరికి అవకాశం ఇచ్చారు. అదే సమయంలో డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణం రాజును ఎంపిక చేశారు. మొత్తం ఈ ఎంపికలో సామాజిక సమతూకం పాటించారు. ప్రాంతాలకు ప్రాధాన్యమిచ్చారు.
* వీరికే ఛాన్స్
అసెంబ్లీ విప్ లుగా.. టిడిపి నుంచి డాక్టర్ బెందాళం అశోక్, యనమల దివ్య, బోండా ఉమా, దాట్ల సుబ్బరాజు, డాక్టర్ థామస్, జగదీశ్వరి, కాల్వ శ్రీనివాసులు, మాధవి రెడ్డప్ప, గణబాబు, తంగిరాల సౌమ్య, యార్లగడ్డ వెంకట్రావుకు అవకాశం దక్కింది. జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, అరవ శ్రీధర్ కు అవకాశం ఇచ్చారు. బిజెపి నుంచి విప్ గా ఆదినారాయణ రెడ్డిని నియమించారు. మండలిలో విప్ లుగా టిడిపి నుంచి వేపాడ చిరంజీవి రావు, కంచర్ల శ్రీకాంత్, జనసేన నుంచి పిడుగు హరిప్రసాద్ కు ఛాన్స్ ఇచ్చారు.
* ఆ ఆశావహులకు
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రి పదవులను ఆశించారు. కానీ మూడు పార్టీలకు సర్దుబాటు చేయాల్సి రావడం, వివిధ సమీకరణలో భాగంగా చాలామంది సీనియర్లకు ఛాన్స్ దక్కలేదు. అటువంటి వారంతా అసంతృప్తికి గురయ్యారు. అందుకే క్యాబినెట్ హోదా దగ్గరగాఉన్న విప్ పదవులకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనానికి తట్టుకొని నిలబడ్డారు కొంతమంది ఎమ్మెల్యేలు. అటువంటి వారిలో డాక్టర్ బెందాలం అశోక్, గణబాబు వంటి వారు ఉన్నారు. వారికి ఇప్పుడు అవకాశం ఇచ్చారు చంద్రబాబు. నేతల్లో అసంతృప్తి తగ్గించేందుకు ఈ నియామకాలు దోహదపడ్డాయని టిడిపి శ్రేణులు చెబుతున్నాయి. అదే సమయంలో జనసేన తో పాటు బిజెపికి ఛాన్స్ ఇవ్వడంపై కూడా ఆ రెండు పార్టీల్లో సంతృప్తి కనిపిస్తోంది.