Swarnandhra Vision 2047 : పారిశ్రామికంగా ఏపీని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు సీఎం చంద్రబాబు. ప్రతి మహిళ ఒక పారిశ్రామికవేత్త కావాలని.. ప్రతి ఒక్కరి చేతిలో పని ఉంటేనే తలసరి ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. స్వర్ణాంధ్ర విజన్2047లో ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పుకొచ్చారు.ప్రధానంగా మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు.ఇంటి నుంచి పని చేసుకుని ఆదాయం పొందే విధానాన్ని అందుబాటులోకి తేనున్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. సీనియర్ సిటిజన్స్ కు కూడా పొదుపు సంఘాలు ఏర్పాటు చేస్తారు. గ్రామాల్లో సైతం ప్రపంచ స్థాయి పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. అయితే పరిశ్రమల ఏర్పాటుకు రవాణా కీలకం.రవాణా రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని విజన్ గా పెట్టుకున్నారు.
* ఉత్పత్తుల రంగానికి హబ్ గా
అయితే ఒకే రంగానికి సంబంధించిన పరిశ్రమలు కాకుండా.. ఏపీని ఉత్పత్తుల రంగ హబ్ గా తయారు చేయాలన్నది ఒక లక్ష్యం. ఇంకోవైపు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలన్నది మరో టార్గెట్. పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా నాణ్యత కలిగిన ఉద్యోగాలు ఇప్పించవచ్చని భావిస్తున్నారు. మానవ వనరుల అభివృద్ధికి పెద్ద పీట వేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో అనుకూలతలు బట్టి పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు. ఆ పరిశ్రమలకు సంబంధించి అన్ని రకాల మౌలిక వసతులు మెరుగు పడుతున్నారు. ముఖ్యంగా అనుబంధ రంగాలకు ప్రోత్సాహం అందించనున్నారు.
* రైల్వే లైన్ల విస్తరణ
అయితే రవాణా రంగాలను మరింత అభివృద్ధి చేయడం ద్వారా ఇతర రంగాలను ప్రభావితం చేయవచ్చు అని భావిస్తున్నారు. అందుకే కోల్కత్తా చెన్నై రైలు మార్గంలో.. రెండు లైన్లను నాలుగు లైన్లు చేసే ప్రణాళిక తయారైంది. విశాఖపట్నంలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు, విమానాల మరమ్మత్తుల సెంటర్ పెట్టనున్నారు. జల రవాణాను పునరుద్ధరించనున్నారు.రాష్ట్రంలో ప్రధాన నగరాలను కలుపుతూ సరికొత్త రోడ్డు మార్గాలను వేయనున్నారు. ప్రధానంగా కోస్టల్ క్యారీడర్ అభివృద్ధిపై దృష్టి పెట్టారు చంద్రబాబు. ఈ అంశాలన్నింటికీ విజన్2047లో అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు.