AP Survey: ఏపీలో ఎన్నికల ప్రచార హోరు ప్రారంభమైంది. అన్ని పార్టీలు ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టాయి. పోటా పోటీగా ప్రచారం చేసుకుంటున్నాయి. అధికార వైసిపి సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై ప్రచారం చేస్తుండగా.. టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించి ప్రజల ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో గట్టి ఫైట్ నెలకొంది. ఈ నేపథ్యంలో సర్వే సంస్థలు హల్చల్ చేస్తున్నాయి. ప్రముఖ సెఫాలజిస్ట్ పార్దాదాస్ కృష్ణాజిల్లాపై చేసిన సర్వే ఫలితాలను వెల్లడించారు.
ఉమ్మడి కృష్ణాజిల్లా అంటే ఒక ప్రధాన సామాజిక వర్గం అధికంగా ఉంటుంది.అటు అమరావతి రాజధాని ప్రభావం సైతంస్పష్టంగా ఉంటుంది. ఈ తరుణంలో వైసిపి, కూటమి పార్టీల మధ్య పోరు పతాక స్థాయిలో ఉంటుందని పార్దాదాసు సర్వే తేల్చి చెబుతోంది. మెజారిటీ స్థానాలు మాత్రం వైసీపీకి దక్కే అవకాశం ఉందని తెలిసింది. ముఖ్యంగా విజయవాడ లో వైసీపీ హవా కనిపిస్తోందని స్పష్టం చేసింది. మిగతా ప్రాంతాల్లో మాత్రం చెరిసగం సీట్లు దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ సర్వే ప్రకారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని 16 అసెంబ్లీ సీట్లలో వైసీపీకి 9 నుంచి 10 సీట్లు దక్కే అవకాశం ఉంది. టిడిపి కూటమికి ఆరు నుంచి ఏడు సీట్లు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయవాడ నగరంలోని మూడు అసెంబ్లీ స్థానాల్లో వైసిపి వైపే మొగ్గు కనిపిస్తోంది.
అయితే వైసిపి ఫైర్ బ్రాండ్ కొడాలి నాని నియోజకవర్గమైన గుడివాడలో భిన్న ఫలితాలు వచ్చాయి. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా నాలుగు సార్లు గుడివాడ నియోజకవర్గం నుంచి కొడాలి నాని గెలుపొందారు. ఈ ఎన్నికల్లో గెలిచి రికార్డు సాధించాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ నాని గెలిచే ఛాన్స్ లేదని ఈ తాజా సర్వే తేల్చేసింది. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతున్నారని స్పష్టం చేసింది. బిజెపితో పొత్తు వ్యవహారంతోనే ఇక్కడ టిడిపి వెనుకబడినట్లు స్పష్టమైంది. జిల్లాలో ముస్లింల ఓటు బ్యాంకు అధికం. అయితే ముస్లిం వర్గాల్లో 70% పైగా వైసీపీకి మొగ్గు కనిపిస్తోంది. కేవలం 26% ముస్లింలు మాత్రమే టిడిపికి మద్దతు తెలుపుతున్నారు.ఈ లెక్కనే ఇక్కడ వైసిపికి ఆధిక్యత కనిపిస్తోందని తెలుస్తోంది.ఇప్పటికే అమరావతి రాజధాని అంశం,ప్రభుత్వంపై వ్యతిరేకత తదితర కారణాలతో కూటమి ముందంజలో ఉండాల్సి ఉంది.అయితేవిజయవాడ నగరం పరిధిలో వైసిపి బలపడడం మాత్రం విశేషం.రూరల్ ప్రాంతాల్లో రెండు పార్టీలు సరి సమానంగా ముందుకు వెళుతున్నట్లు ఈ సర్వే తేల్చింది.