Amaravati: అమరావతికి షాక్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి కొత్త శోభతో వెలుగొందుతోంది. కొత్తగా ఊపిరి పోసుకుంది. ఐదేళ్ల వైసిపి పాలనలో విధ్వంసమైన అమరావతి రాజధానిని తిరిగి గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తోంది.అమరావతిని పూర్వస్థితిలోకి తెచ్చి నిర్మాణాలు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది.కొత్త ప్రాజెక్టుల కోసం ప్రయత్నిస్తోంది.అటు అమరావతిలో రవాణా సౌకర్యం మెరుగుపరిచేందుకు కీలక రోడ్ల నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని శరవేగంగా జరపాలని భావిస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే అమరావతికి ఎదురు దెబ్బ తగిలింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తమ యూనిట్ ను అమరావతిలో మూసివేయాలని సంచలన నిర్ణయం తీసుకుంది.
2014లో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో అమరావతిలో కీలక సంస్థలు ఏర్పాటయ్యాయి. అందులో భాగంగానే NHAI ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ యూనిట్ ఏర్పాటయింది. అప్పట్లో అనంతపురం- అమరావతి ఎక్స్ ప్రెస్ వే, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వంటి పలు ప్రాజెక్టులను ఇది చేపట్టింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టులన్ని పక్కకు వెళ్లిపోయాయి. దీంతో నేషనల్ హైవే కు సంబంధించి అమరావతి యూనిటుకు ఎటువంటి పని లేకుండా పోయింది. ఇతర ప్రాంతాల పనులను ఇక్కడ సిబ్బందికి అప్పగించారు. ఇప్పుడు దీనిని ఏకంగా మూసివేశారు. విజయవాడ యూనిట్ లో విలీనం చేశారు. దీంతో అమరావతి విషయంలో చిన్నపాటి ఇబ్బంది ఎదురైంది. అయితే కూటమి ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించి తిరిగి తెరిపించేందుకు ప్రయత్నించే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి.
ఇటీవల చంద్రబాబు ఢిల్లీలో పర్యటించారు. ప్రధాని మోదీ తో పాటు కేంద్ర మంత్రులను కలిశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి సాయం అర్థించారు. ముఖ్యంగా రహదారుల నిర్మాణానికి అవసరమైన చర్యల గురించి వివరించే ప్రయత్నం చేశారు. దీనిపై మంత్రి నితిన్ గడ్కరి సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం సానుకూలంగా ఉంది. తద్వారా అమరావతికి సాయం చేశామన్న మంచి పేరు వస్తుందన్న భావనతో ఉంది. ఈ బడ్జెట్ లోనే ఐదు నుంచి పదివేల కోట్ల రూపాయలు కేటాయించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ 189 కిలోమీటర్ల రహదారి నిర్మాణం చేపట్టాలన్నది..ఔటర్ రింగ్ రోడ్డు ముఖ్య ఉద్దేశ్యం. ఆరు లైన్లుగా ఈ రహదారి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. దీనికి నేషనల్ హైవే యూనిట్ కీలకం. ఇటువంటి సమయంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ యూనిట్ ఎత్తివేయాలన్న నిర్ణయం తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.అయితే ఈ విషయంలో చంద్రబాబు ప్రత్యేకంగా అభ్యర్థించే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా కేంద్రం పునః పరిశీలన చేస్తుందని.. అమరావతి లోనే నేషనల్ హైవే అథారిటీ యూనిట్ ను కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. విశ్లేషకులు సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరి ఏం జరుగుతుందో చూడాలి.
అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు,విభాగాలకు అమరావతిలో భూములు కేటాయించారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో కేంద్ర సంస్థలు నిర్మాణాలు జరిపేందుకు ముందుకు రాలేదు. వారితో సిఆర్డిఏ అధికారులు సంప్రదిస్తున్నారు. కేంద్రం సైతం సానుకూలంగా ఉంది.ఇటువంటి సమయంలో నేషనల్ హైవే అథారిటీ వెనక్కి తగ్గితే.. ఆ విభాగానికి సైతం అమరావతిలో భూములు కేటాయించే అవకాశం ఉంది. మరి నేషనల్ హైవే అథారిటీ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందో చూడాలి. తిరిగి అమరావతిలో యూనిట్ కొనసాగుతుందన్న నమ్మకం అయితే అందరిలోనూ కనిపిస్తోంది.రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం, కేంద్రం స్పందించే తీరుబట్టి ఆధారపడి ఉంది.