Banakacherla Project: ఏపీ ప్రభుత్వానికి ( AP government) షాక్ తగిలింది. అది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి. పోలవరం- బనకచర్ల అనుసంధానానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. దానిని ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా భావిస్తున్నారు. సముద్రంలో కలుస్తున్న వృధా జలాలను సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా బనకచర్ల ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. ఈ ప్రాజెక్టుతో రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని చంద్రబాబు భావించారు. తెలంగాణకు జలవివాదం పరిష్కరించుకునేందుకు సైతం చొరవ చూపారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు నిరాకరించినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనలను తిప్పి పంపింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ తగిలినట్లు అయ్యింది. బనకచర్ల కాలువల సామర్థ్యం పెంపు పనులు చేపట్టాలన్న చంద్రబాబు ప్రభుత్వ ఆశలకు బ్రేక్ పడింది.
Also Read: ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ కు ముందున్నవన్నీ గడ్డు రోజులేనా?
* తెలంగాణ నుంచి అభ్యంతరాలు..
బనకచర్ల ప్రాజెక్టు( Banka cherla project) విషయంలో తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు ఉన్నాయి. దాదాపు 3 వేల టీఎంసీలు గోదావరి జలాలు సముద్రంలో వృధాగా కలిసిపోతున్నాయి. అయితే ఈ వృధా జలాల్లో వినియోగానికి సంబంధించి తమకు సింహభాగం ప్రయోజనాలు కావాలని తెలంగాణ కోరుతోంది. హైదరాబాద్ నగరానికి తాగునీరు, మిగతా తెలంగాణ జిల్లాలకు సాగునీరు అందించాలంటే దాదాపు 1900 టిఎంసిల నీరు తమకే ఉండాలని తెలంగాణ వాదిస్తోంది. చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు తెరపైకి తేవడంతో.. తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయి. అయితే దీనిపై కూర్చుని మాట్లాడుకుందామని చంద్రబాబు ప్రతిపాదన చేశారు. అయితే చంద్రబాబుతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న సాన్నిహిత్యం మూలంగా.. దానిని రాజకీయం చేసే పనిలో పడ్డాయి విపక్షాలు. అందుకే బనకచర్ల ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దాని పర్యవసానం మూలంగానే పర్యావరణ అనుమతులు నిరాకరించారని సమాచారం.
* రేవంత్ పై చంద్రబాబు విమర్శలు..
అయితే ఈ విషయంలో ఏపీ నుంచి కూడా గట్టి వాదనలు వినిపించాయి. తెలంగాణ సీఎం రేవంత్ తీరుపై చంద్రబాబు ( AP CM Chandrababu)విమర్శలు చేశారు. సముద్రంలో కి వృధాగా పోతున్న నీటిని వినియోగించుకుంటే తప్పు ఏముందని ఆయన ప్రశ్నించారు. కూర్చుని మాట్లాడుకుంటే సమస్యకు ఒక పరిష్కార మార్గం లభిస్తుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చేది లేదని కేంద్రం చెబుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని కేంద్రం ఈ తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అనేక అభ్యంతరాలు రావడంతోనే అనుమతులు నిలిపివేస్తున్నట్లు నిపుణుల కమిటీ సైతం అభిప్రాయపడింది. అయితే ఈ విషయంలో చంద్రబాబు ఎలా ముందుకు వెళ్తారో చూడాలి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం జఠిలంగా మారకుండా ఉండేందుకు ఆయన ఎలా వ్యూహం వేస్తారో చూడాలి.
* రాజకీయ కోణంలోనే..
అయితే బనకచర్ల విషయంలో కేంద్ర వైఖరి పలు అనుమానాలకు తావిస్తోంది. కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం( NDA government). ఎన్డీఏ లో కీలక భాగస్వామిగా ఉంది తెలుగుదేశం. ఏపీలో టిడిపి కూటమిలో బిజెపి సైతం ఉంది. దీంతో ఏపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. కానీ తెలంగాణ నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవడం వెనుక రాజకీయ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. 2028 ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బిజెపి భావిస్తోంది. ఇప్పుడు గాని బనకచర్ల విషయంలో ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తే తెలంగాణలో రాజకీయంగా ఇబ్బంది పడతామని బిజెపి భావించింది. అందుకే పర్యావరణ అనుమతుల విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. చూడాలి మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో..