Caste Politics in Srikakulam: అసలు ఆ జిల్లాలో ఏమవుతోంది? అక్కడ రాజకీయ సమీకరణలు మారుతున్నాయా? కుల పోరుకు తెర లేపారా? కొన్ని కుటుంబాల ఆధిపత్యానికి గండి పడనుందా? అసలు ఏం జరుగుతోంది?.. ఈ విషయాలు తెలియాలంటే శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను ఒకసారి చూడాలి. ఇటీవల జరిగిన ఓ పరిణామం కులాల మధ్య కుంపట్ల కు దారితీసింది. ఆమదాలవలస ఎమ్మెల్యే గా ఉన్న కూన రవికుమార్ పై ఎస్సీ వర్గానికి చెందిన ఓ మహిళా ఉద్యోగిని సంచలన ఆరోపణలు చేశారు. అవి ప్రకంపనలకు దారితీశాయి. ఇలా ఉండగా ఏ పార్టీతో సంబంధం లేని కాలింగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. ఈ వివాదం వెనుక ధర్మాన, కింజరాపు కుటుంబాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ఇంతలో రాజకీయంగా యాక్టివ్ అయ్యారు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ ఉన్నట్టుండి ప్రజా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
రెండు కులాల మధ్య వైరం..
శ్రీకాకుళం జిల్లాలో( Srikakulam district) కుల సమరానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇక్కడ ప్రధాన కులాలుగా కాలింగ, వెలమ, తూర్పు కాపు సామాజిక వర్గాలు ఉన్నాయి. ఇంకా యాదవ, కళింగ కోమట్లు, మత్స్యకారుల సైతం ఉన్నారు. అయితే ప్రధాన కులాల్లో.. కాళింగ వర్సెస్ వెలమ అన్నట్టు పరిస్థితి ఉంది. రాజకీయ ఆధిపత్యం కోసం ఆ రెండు సామాజిక వర్గాల మధ్య ఇప్పుడు సమరం ప్రారంభం అయింది. ఎవరు అవునన్నా కాదన్నా.. గత కొన్ని దశాబ్దాలుగా వెలమ సామాజిక వర్గ ఆధిపత్యం జిల్లాలో ఉంది. దీనిని సహించుకోలేకపోతోంది కాళింగ సామాజిక వర్గం. ఎలాగైనా వెలమ సామాజిక వర్గానికి చెప్పాలని భావిస్తోంది. అందుకే ఆ సామాజిక వర్గంలో అన్ని పార్టీల నేతలు ఏకతాటిపైకి రావాలన్న ప్రయత్నం జరుగుతోంది. అయితే అది అంత సులువుగా జరిగే పని కాదని తెలుస్తోంది.
నాలుగు దశాబ్దాలకు పైగా కాలింగులదే చేయి
శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గానికి( Srikakulam Parliament Constituition ) 1952లో ఎన్నికలు జరిగాయి. 1996 వరకు లోక్సభ స్థానం కాలింగ సామాజిక వర్గానికి చెందిన నేతల చేతుల్లోనే ఉంది. 1952లో బొడ్డేపల్లి రాజగోపాల్ రావు తొలిసారిగా ఎంపీ అయ్యారు. 1957, 1962, 1967, 1971, 1977, 1980 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. 1984 ఎన్నికల్లో అదే సామాజిక వర్గానికి చెందిన హనుమంతు అప్పయ్య దొర ఎంపీగా గెలిచారు. 1989లో అదే కులానికి చెందిన కణితి విశ్వనాథం విజయం సాధించారు. 1991లో సైతం ఆయనే రెండోసారి గెలిచారు. అంటే శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కాలింగ సామాజిక వర్గానికి చెందిన నేతలే ప్రాతినిధ్యం వహించారు. అయితే 1996లో మాత్రం కింజరాపు ఎర్రం నాయుడు ఎంపీగా గెలిచారు. ఆయన వెలమ సామాజిక వర్గానికి చెందిన నేత. 1998, 1999, 2004లో సైతం ఆయనే గెలిచారు. 2009లో మాత్రం కాళింగ సామాజిక వర్గానికి చెందిన మహిళ నేత పిల్లి కృపారాణి విజయం సాధించారు. అయితే 2014, 2019, 2024లో హ్యాట్రిక్ కొట్టారు కింజరాపు రామ్మోహన్ నాయుడు. అంటే వెలమ సామాజిక వర్గం ఓ మూడు దశాబ్దాల పాటు పట్టు సాధించిందన్నమాట.
వెలమల కే ప్రాధాన్యం..
రాష్ట్ర ప్రభుత్వంలో సైతం కాళింగ సామాజిక వర్గం కంటే వెలమ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యం దక్కుతోంది. 2004, 2009 లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ధర్మాన ప్రసాదరావు( dharmana Prasad Rao ) మంత్రిగా వ్యవహరించారు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా నుంచి కింజరాపు అచ్చెనాయుడు మంత్రి పదవి పొందారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ధర్మాన కృష్ణ దాసు తొలిసారిగా మంత్రి అయ్యారు. విస్తరణలో ధర్మాన ప్రసాదరావు చోటు దక్కించుకున్నారు. 2024లో టిడిపి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్లీ అచ్చెనాయుడు మంత్రి అయ్యారు. ప్రస్తుతం అదే కుటుంబానికి చెందిన రామ్మోహన్ నాయుడు కేంద్రమంత్రిగా ఉన్నారు.
జరిగే పనేనా?
అయితే రాజకీయంగా కింజరాపు, ధర్మాన కుటుంబాలు సహకరించుకుంటున్నాయి అన్నది కలింగ సామాజిక వర్గ నేతల్లో ఉన్న అనుమానం. అందుకే కాలింగ సామాజిక వర్గం ఏకతాటిపైకి రావాలని ఆ సామాజిక వర్గం నేతలు భావిస్తున్నారు. ధర్మాన, కింజరాపు కుటుంబాలపై ఆగ్రహంగా ఉన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ బాహాటంగానే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే తమ్మినేని సీతారాం యాక్టివ్ కావడం, తన రాజకీయ ప్రత్యర్థి కూన రవికుమార్ పై ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవడం చూస్తుంటే మాత్రం తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానం ఉంది. అయితే ధర్మాన, కుటుంబాలకు జిల్లా వ్యాప్తంగా కేడర్ ఉంది. ఆపై ఇతర సామాజిక వర్గాల వారు ఆ రెండు కుటుంబాలను ఇష్టపడతారు. కానీ కాళింగ సామాజిక వర్గం నేతలు మాత్రం కేవలం తమ తమ నియోజకవర్గాలకే పరిమితం అవుతున్నారు. సొంత నియోజకవర్గంలో సొంత సామాజిక వర్గం వారే ప్రత్యర్థులుగా ఉండడం కాలింగులకు మైనస్. వారు కలిసి ప్రయాణించడం అనేది జరగని పని. అందుకే ఇవి వృధా ప్రయత్నాలు తప్ప.. వర్కౌట్ కావని విశ్లేషకుల అభిప్రాయం.