Four Sisters Gets Govt Jobs: ప్రభుత్వ ఉద్యోగం అంటేనే గగనం అవుతున్న రోజులు ఇవి. అసలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కూడా జరగడం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వపరంగా ఉద్యోగాల రిక్రూట్మెంట్ జరుగుతోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ పరంగా అంతంత మాత్రమే. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం అయింది. మెగా డీఎస్సీ ప్రకటించి 16,347 పోస్టులను భర్తీ చేయనుంది ఏపీ ప్రభుత్వం. అయితే ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం పేద కుటుంబాల్లో కూడా ఆనందం నింపుతోంది. పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ సాగుతోంది. ధ్రువపత్రాల పరిశీలన కూడా ప్రారంభం అయ్యింది. ఈరోజు అన్ని జిల్లాల్లో జిల్లా కమిటీలు దరఖాస్తులను పరిశీలిస్తున్నాయి. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత తుది జాబితాను ప్రకటించనున్నారు. పోస్టింగ్స్ ఇవ్వనున్నారు. అయితే పేద కుటుంబాల్లో ఈ ఉద్యోగాలు వెలుగులు నింపుతున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా శిక్షణ తీసుకున్న వారు ఉద్యోగాలకు ఎంపిక కావడంతో.. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఒక సామాన్య టైలర్ కుమారుడు జాకీర్ హుస్సేన్. డీఎస్సీలో ఏకంగా నాలుగు ఉద్యోగాలకు అర్హత సాధించి శభాష్ అనిపించుకున్నాడు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల కు చెందిన జాకీర్ హుస్సేన్ తండ్రి షేక్ సైదా టైలర్. తండ్రి కష్టాన్ని అర్థం చేసుకుని చదివిన జాకీర్ హుస్సేన్ ఒకే సమయంలో నాలుగు ఉపాధ్యాయ పోస్టులకు అర్హత సాధించాడు. ఎస్జీటీలో జిల్లాస్థాయిలో నాలుగో ర్యాంక్, స్కూల్ అసిస్టెంట్ సోషల్ విభాగంలో 27వ ర్యాంక్, టీజీటీ సోషల్ విభాగం జోనల్ స్థాయిలో 16వ ర్యాంక్, స్కూల్ అసిస్టెంట్ తెలుగులో 71 ర్యాంకు సాధించాడు. 2018 డీఎస్సీలో అయితే తక్కువ మార్కులతోనే ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయాడు. మరింత పట్టుదలతో వ్యవహరించి ఈ ఘనత సాధించాడు.
తల్లి రెక్కల కష్టంతో చదివిన ఓ నిరుపేద యువతి ఉపాధ్యాయ పోస్టును సాధించింది. చిత్తూరు జిల్లా వేపమాకులపల్లి కి చెందిన గౌరమ్మకు నలుగురు కుమార్తెలు. భర్త కొన్నేళ్ల కిందట చనిపోయాడు. అప్పటినుంచి కష్టపడి పిల్లలను చదివించింది. అందులో చిన్న కుమార్తె శిరీష ఎస్ జి టి పోస్ట్ కు ఎంపికయింది. అయితే ఈ కుటుంబంలో మిగతా ముగ్గురు పిల్లలు సైతం ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడం విశేషం. పెద్ద కుమార్తె వీణ 2014లో కానిస్టేబుల్ గా ఎంపికయింది. ఆ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించిన మొదటి వ్యక్తి ఆమె. ఇక రెండో కుమార్తె వాణి 2016 డీఎస్సీలో సెకండరీ గ్రేడ్ టీచర్ గా ఎంపికయింది. మూడో కుమార్తె వనజాక్షి ఇటీవల కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయింది. ఇక నాలుగో కుమార్తె శిరీష ఉపాధ్యాయురాలిగా ఎంపికయింది. దీంతో ఆ పేద కుటుంబంలో నలుగురు పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులుగా మారడంతో తల్లి గౌరమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.