Machilipatnam Ration Rice Case : మాజీ మంత్రి పేర్ని నానికి షాక్ తగిలింది. మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం వ్యవహారంలో ఆయన భార్య పేరు తెరపైకి వచ్చింది. దీంతో ముందస్తు బెయిల్ కోసం ఆయన కృష్ణాజిల్లా కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇంతలో పోలీసులు పేర్ని నానిని ఇదే కేసులో ఏ6గా చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఈ కేసులో పేర్ని నాని సతీమణి జయసుధ, గోదాము మేనేజర్ పైనే అభియోగాలు నమోదయ్యాయి. ఈ క్రమంలో వీరిద్దరిని అరెస్టు చేస్తారని కూడా ప్రచారం నడిచింది. పేర్ని నాని అయితే కుటుంబంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే తన భార్య అరెస్టు కోసం మంత్రి కొల్లు రవీంద్ర ఒత్తిడి పెంచారని.. కానీ చంద్రబాబు ఒప్పుకోలేదని.. ఆయన హుందాతనానికి అభినందించాల్సిందేనట్టు వ్యాఖ్యానించారు నాని. అయినా సరే పేర్ని నానికి రేషన్ బియ్యం కేసులో ఊరట దక్కకపోవడం విశేషం.
* చంద్రబాబుకు పొగడ్తలతో ముంచేత్తిన
వైసిపి హయాంలో పేర్ని నాని మంత్రిగా ఉండేవారు. ఆ సమయంలో ఆయన భార్య పేరిట ఉన్న గోదాముల్లో రేషన్ బియ్యం నిల్వ చేసేవారు. అయితే అందులో 7000 కు పైగా బియ్యం బస్తాలు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పౌర సరఫరాల శాఖతో పాటు పోలీస్ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ తరుణంలో పేర్ని నాని సతీమణి జయసుధను అరెస్టు చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. కానీ కుటుంబంతో కలిసి పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు కూడా టాక్ నడిచింది. అయితే ఉన్నట్టుండి పేర్ని నాని ప్రత్యక్షమయ్యారు. మీడియా ముందుకు వచ్చి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. గోదాముల్లో మాయమైన బియ్యానికి పరిహారం డిడి ల రూపంలో చెల్లించామని.. పోలీస్ విచారణ కంటే ముందు తమను దోషులుగా చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భార్యను ఇరికించేందుకు మంత్రి కొల్లు రవీంద్ర ప్రయత్నించారని సంచలన ఆరోపణలు చేశారు. కేవలం చంద్రబాబు హుందాతనంతోనే తన భార్య అరెస్టులు జరగని విషయాన్ని ప్రస్తావించారు.
చంద్రబాబుపై పొగడ్తలతో పేర్ని కుటుంబానికి ఈ కేసులో ఊరట దక్కుతుందని అంతా భావించారు. కానీ ఏకంగా ఈ కేసులో ఏ 6 గా చేరుస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. అయితే నిన్న కృష్ణ జిల్లా కోర్టు జయసుధకు ముందస్తు బెయిల్ ఇచ్చింది. దీంతో ఇకనుంచి వారికి ఇబ్బంది ఉండదు అని అంతా భావించారు. కానీ ఏకంగా పేర్ని నాని పైనే కేసు నమోదు కావడం విశేషం. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి గోడౌన్ మేనేజర్, రైస్ మిల్ యజమాని, లారీ డ్రైవర్ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే ఇప్పుడు అదే కేసు భార్యతో పాటు పేర్ని నాని మెడకు చుట్టుకోవడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.