Budi Mutyala Naidu: డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు కు ‘సన్’ స్ట్రోక్

ఏపీలో ఇప్పుడు మాడుగుల నియోజకవర్గం పై అందరి దృష్టి ఉంది. ఇక్కడ బూడి ముత్యాల నాయుడు ప్రాతినిధ్యం వహిస్తుండేవారు. విస్తరణలో మంత్రి పదవి పొందిన ముత్యాల నాయుడుకు జగన్ డిప్యూటీ సీఎం హోదాను కూడా కట్టబెట్టారు.

Written By: Dharma, Updated On : May 1, 2024 9:50 am

Budi Mutyala Naidu

Follow us on

Budi Mutyala Naidu: ఒకవైపు కూతురు.. మరోవైపు కొడుకు.. మధ్యలో వైసిపి మంత్రి. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన కథ ఇది. ఎన్నికల్లో ఒక వైపు కూతురు దిగగా.. ఆమెకు ప్రత్యర్థిగా కుమారుడు నిలిచారు. కానీ ఆ మంత్రి కుమార్తెకి మద్దతు తెలిపారు. మరి కూతురు గెలుస్తుందా? కుమారుడు గెలుస్తాడా? లేకుంటే వారి ప్రత్యర్థి గెలుస్తాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఆ మంత్రి డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు కాగా… మాడుగుల నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది.

ఏపీలో ఇప్పుడు మాడుగుల నియోజకవర్గం పై అందరి దృష్టి ఉంది. ఇక్కడ బూడి ముత్యాల నాయుడు ప్రాతినిధ్యం వహిస్తుండేవారు. విస్తరణలో మంత్రి పదవి పొందిన ముత్యాల నాయుడుకు జగన్ డిప్యూటీ సీఎం హోదాను కూడా కట్టబెట్టారు. మాడుగులలో మరోసారి ఆయన తప్పకుండా గెలుస్తారని అంచనాలు ఉన్నాయి. కానీ అనూహ్యంగా జగన్ ముత్యాల నాయుడును అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. అయితే అనకాపల్లి అసెంబ్లీ సీటును తన కుమార్తెకు ఇవ్వాలని ముత్యాల నాయుడు షరతు పెట్టారు. దానికి జగన్ అంగీకరించారు. అక్కడే ముత్యాల నాయుడు కుమారుడు రవి తెరపైకి వచ్చాడు. తాను ఉండగా రాజకీయ వారసురాలిగా తన సోదరిని ప్రకటించడం పై అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ ముత్యాల నాయుడు కుమార్తె వైపే మొగ్గు చూపారు. అక్కడ నుంచి కుటుంబంలో రచ్చ జరుగుతోంది. ప్రస్తుతం రవి మాడుగుల అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా పోటీకి దిగారు.

బూడి ముత్యాల నాయుడు కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య కొడుకు రవి కాగా.. ఇప్పుడు వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన అనురాధ రెండో భార్య కూతురు. అనురాధ ప్రస్తుతం జడ్పిటిసి గా వ్యవహరిస్తున్నారు. అప్పట్లో కూడా ఇటువంటి వివాదం జరగగా రవి ఎన్నికల నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు మాత్రం తగ్గేది లే అంటున్నారు. ముత్యాల నాయుడు రాజకీయ వారసుడుగా మాడుగుల నుంచి పోటీ చేయాలని రవి భావించారు. తన తండ్రి తో పాటు వైసిపి హై కమాండ్ అంగీకరించకపోవడంతో ఏకంగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. రవిని పోటీ నుంచి తప్పించాలని ముత్యాల నాయుడు చివరి వరకు ప్రయత్నం చేశారు. కానీ కుదరలేదు. దీంతో అక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది. చివరి నిమిషంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి టిడిపి టికెట్ ఇచ్చింది. దీంతో అక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది. రవి రోజురోజుకు పట్టు బిగిస్తున్నారు. తండ్రి ముత్యాల నాయుడు తో పాటు సోదరి అనురాధ పై విమర్శలు చేస్తున్నారు.

తాజాగా రవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న తన తండ్రి ముత్యాల నాయుడు ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన సోషల్ మీడియాలో విడుదల చేసిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.’ కన్న కొడుకుకు న్యాయం చేయలేని వారు.. ఓటేసిన ప్రజలకు ఏం న్యాయం చేయగలరు? ఆలోచించి ఓటు వేయండి. మా నాన్న బూడి ముత్యాల నాయుడు ని ఓడించండి ‘ అంటూ పిలుపునిచ్చిన ఓ చిత్రం సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతోంది. మొత్తానికైతే ఎన్నికల్లో డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు కు సన్ స్ట్రోక్ తగులుతోంది.