BRS MP Funds: ఏపీలో మరోసారి అధికారంలోకి వస్తామని వైసిపి భావిస్తోంది. జగన్ సైతం అదే తరహా ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్నారు. సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని నమ్మకం పెట్టుకున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. అభివృద్ధి లేదనే మాట ప్రజల నుంచి వినిపిస్తోంది. అయితే ఇవేవీ పట్టించుకోని జగన్ తన ఐదేళ్ల పాలనను గడిపేశారు. మరో రెండు నెలల్లో ఎన్నికల్లో ప్రజల అభిప్రాయాన్ని కోరనున్నారు. అయితే వైసిపి ప్రజా ప్రతినిధుల పనితీరు మాత్రం మరీ అంత ఆశాజనకంగా లేదు. దీంతో ఏపీ ప్రజలు తెలంగాణ ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తున్నారు. వారి ద్వారా కొన్ని అభివృద్ధి పనులు చేయించుకుంటున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో స్మశాన వాటిక పనులు జరుగుతున్నాయి. ఇక్కడ డిప్యూటీ సీఎం రాజన్న దొర ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సాలూరు పట్టణంలో స్మశాన వాటిక అస్తవ్యస్తంగా ఉండడంతో పౌర సంఘాలు రాజన్న దొరను ఆశ్రయించాయి. అరకు ఎంపీ మాధురిని సైతం ఆ ప్రతినిధులు కలిశారు. కానీ వారి నుంచి ఎటువంటి స్పందన లేక పోయింది. నిధుల విడుదల కూడా జరగలేదు.
అయితే సాలూరు పట్టణ పౌర సంఘాల ప్రతినిధులు సొంత నిధులు పోగుచేసుకుని స్మశాన వాటిక అభివృద్ధి చేసుకోవాలని భావించారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన ప్రముఖులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న సాలూరు కు చెందిన సుతాపల్లి వెంకట్రావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన అక్కడి రాజ్యసభ సభ్యుడు లింగయ్య యాదవ్ కు ఈ విషయాన్ని చెప్పారు. నిధులు కావాలని కోరారు. దీంతో ఆయన రూ.10 లక్షలు కేటాయించారు. ప్రస్తుతం ఆ నిధులతోనే స్మశాన వాటిక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.స్థానికంగా సమస్యలు, అభివృద్ధిపై పక్క రాష్ట్రాల నేతలకు ఉన్న శ్రద్ధ స్థానిక ప్రజాప్రతినిధులకు లేకపోవడంపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యం అని.. దీనికి మూల్యం తప్పదని కూడా ప్రజలు హెచ్చరిస్తున్నారు. కానీ జగన్ మాత్రం తనకు సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని కొండంత నమ్మకం పెట్టుకోవడం విశేషం